టార్గెట్‌ టెన్షన్‌.. లక్ష్యం సాధించని బొగ్గు ఉత్పత్తి

ABN , First Publish Date - 2020-12-18T04:40:45+05:30 IST

సింగరేణి బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఒక వైపు కరోనా.. మరో వైపు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఈ ఏడాది భూపాలపల్లి ఏరియాలో తీవ్ర ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి.

టార్గెట్‌ టెన్షన్‌.. లక్ష్యం సాధించని బొగ్గు ఉత్పత్తి
కేటీకే-5వ గని ముఖద్వారం

మిగిలింది నాలుగు నెలలే..

సింగరేణిపై కరోనా.. భారీ వర్షాల ప్రభావం

కాకతీయఖని, డిసెంబరు 17: సింగరేణి బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఒక వైపు కరోనా.. మరో వైపు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఈ ఏడాది భూపాలపల్లి ఏరియాలో తీవ్ర ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో యాజమాన్యం ఏరియాకు నిర్దేశించిన లక్ష్యం 38 లక్షల 90 వేల టన్నులు కాగా  ఇప్పటి వరకు 9,39,802 మాత్రమే ఉత్పత్తిని సాధించారు.  ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది నెలలు గడిచిపోయాయి. అయినా లక్ష్య సాధనలో భూపాలపల్లి ఏరియా ఇంకా బహుదూరంగా ఉంది. 

నవంబర్‌ నాటికి సాధించింది 41 శాతమే.

భూపాలపల్లి ఏరియాలో నాలుగు అండర్‌గ్రౌండ్‌ గనులు, రెండు ఓపన్‌కాస్ట్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే 2020 ఏప్రిల్‌ నుంచి నవంబరు 30 వరకు సాధించాల్సిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 22,85,000 టన్నులు కాగా 9,39,802 టన్నులు మాత్రమే సాధించింది. ఇంకా 13,45,198 టన్నులు వెనుక బడి ఉంది. సంస్థ నిర్దేశించిన లక్ష్యంలో కేవలం 41 శాతం మాత్రమే సాధించింది. గత ఏడాదితో పోలిస్తే 4,38,374 టన్నుల బొగ్గు ఉత్పత్తి తక్కువ సాధించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మిగిలిన నాలుగు నెలల్లో నిర్దేశిత లక్ష్యం చేరుకునేనా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  ఏరియా అధికారుల్లో టార్గెట్‌ టెన్షన్‌ నెలకొంది. ఉత్పత్తి లక్ష్యాన్ని పెంచుకునేందుకు కసరత్తు చేస్తున్నారు.

ఉత్పత్తిపై కరోనా ప్రభావం...

కరోనా ప్రభావంతో రెండు నెలలపాటు లేఆ్‌ఫను ప్రకటించింది యాజమాన్యం. రెండు నెలల విరామం తర్వాత ఉత్పత్తి ప్రారంభమైంది. అయితే  వర్షాలు మొదలు కావడంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరా యం ఏర్పడింది. కరోనా ప్రభావంతో కార్మికుల గైర్హాజ రు పెరిగింది. అలాగే కార్మికుల సమస్యలు పరిష్కరిం చా లంటూ కార్మిక సంఘాలు సమ్మె బాట పట్టడంతో బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపింది.

 ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తాం: నిరీక్షణ్‌రాజ్‌, జీఎం, భూపాలపల్లి ఏరియా

కార్మికుల గైర్హాజరుపై దృష్టి పెంచాం. అలాగే కరోనా ప్రబలకుండా అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్ట్‌లో పనులను వేగవంతం చేస్తున్నాం. ఏరియాలోని అన్ని డిపార్టుమెంట్లలో పనిచేస్తున్న ఉన్నత స్థాయి అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి ఉత్పత్తి ఉత్పాదకతపై చర్చిస్తున్నాం. మిగిలిన నాలుగు నెలల్లో మెరుగైన బొగ్గు ఉత్పత్తితో లక్ష్యాన్ని సాధిస్తాం. 

Updated Date - 2020-12-18T04:40:45+05:30 IST