సింగ‌రేణి సంస్థ ఆవిర్భావానికి వందేళ్లు

ABN , First Publish Date - 2020-12-23T01:26:15+05:30 IST

దక్షిణ భారతానికి వెలుగులు అందిస్తూ.. ఉత్తర తెలంగాణ దశనే మార్చేసిన సిరుల వేణి. వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది.

సింగ‌రేణి సంస్థ ఆవిర్భావానికి వందేళ్లు

హైదరాబాద్: సింగరేణి నల్లబంగారం.. తెలంగాణకు కొంగు బంగారం. దక్షిణ భారతానికి వెలుగులు అందిస్తూ.. ఉత్తర తెలంగాణ దశనే మార్చేసిన సిరుల వేణి. వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తోంది. ప్రగ‌తి ప‌థంలో దూసుకు పోతోంది. మొత్తంగా చూస్తే ఈ బొగ్గుగని చరిత్రకు 131 ఏళ్లు. కానీ, సింగరేణి గొడుగు కిందకు వచ్చి బుధవారంతో వందేళ్లు నిండాయి. ఈ సందర్భంగా సింగరేణి ప్రస్థానంపై ఏబీఎన్‌ స్పెషల్‌ రిపోర్ట్‌.




తెలంగాణాలో సిరుల మాగాణి సింగరేణి. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ.. దేశంలో వేలాది పరిశ్రమలకు ఇంధనాన్ని అందిస్తున్న నల్ల బంగారుగని 'సింగరేణి'. దేశంలోనే మొట్ట మొదట బొగ్గు ఉత్పత్తి రంగంలోకి అడుగుపెట్టిన ప్రభుత్వరంగ సంస్థగా సింగరేణి తనకంటూ ఒక ప్రత్యేక చరిత్రను లిఖించుకుంది.




131 ఏళ్ల క్రితం ఒక చిన్న గ్రామంలో మొదలైన సింగరేణి సంస్థ క్రమక్రమంగా విస్తరించింది. జియాలజిస్టు డాక్టర్ విలియం కింగ్స్ ప్రస్తుతం ఇల్లెందు మండలంగా ఉన్న బొగ్గుట్టలో బొగ్గు ఉనికిని కనుగొన్నారు. బ్రిటీష్ వారి పాలనలో 1886లో హైదరాబాద్ దక్కన్ కంపెనీ లిమిటెడ్‌గా ఇంగ్లాండ్ స్టాక్ ఎక్చేంజ్‌లో నమోదు చేయబడిన సింగరేణి సంస్థ 1889లో ఉత్పత్తిని ప్రారంభించింది. 1920 డిసెంబర్ 23న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌గా రూపాంతరం చెందింది. ఈ లెక్కన సింగ‌రేణి సంస్థ ఆవిర్భానికి వందేళ్లు నిండాయి.



పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా హైదరాబాద్ కంపెనీస్ యాక్టు ప్రకారం నమోదైన సింగరేణి తొలుత బ్రిటిష్‌ పాలకుల అజమాయిషీలో పనిచేసింది. ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్ర నైజాం రాజు అజమాయిషీలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ అధీనంలో కొనసాగింది. ఎన్నో కష్ట నష్టాలను భరించి.. అనేక సంస్కరణలను ప్రవేశపెట్టి ప్రస్తుతం విజయప‌థంలో దూసుకెళుతోంది.



మొదట్లో చాల కొద్ది ప్రాంతానికే పరిమితమైన సింగరేణి బొగ్గు గనులు.. కాల గమనంలో విస్తరించాయి. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో విస్తరించి ఉన్న గోదావరి పరీవాహక ప్రాంతంలోని 350 కిలో మీటర్ల మేర నిక్షిప్తమై ఉన్న అపారమైన బొగ్గు ఖనిజాన్ని ఈ సంస్థ తవ్వి తీస్తోంది. దక్షిణ భారతదేశంలో సుమారు నాలుగు వేల పరిశ్రమలకు, విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు కావలసిన ఇంధనం ఇక్కడి నుంచే సరఫరా అవుతోంది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంలో కొనసాగుతోంది.



బొగ్గు నిల్వల గుర్తింపు, ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి లెక్కిస్తే 131 ఏళ్ల చరిత్ర సింగరేణి సొంతం. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థగా గుర్తింపు పొందింది. మూడు తరాల కార్మికుల చెమట చుక్కలకు ప్రత్యక్ష నిదర్శనంగా సింగరేణి విరాజిల్లుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వందల కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెడుతోంది. జియోలాజికల్‌ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గోదావరి తీరంలోని ఆరు జిల్లాల పరిధిలో 22వేల 207 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు 1,500 మిలియన్‌ టన్నులకు పైగా బొగ్గును వెలికితీశారు.



ఒకప్పుడు తట్టా చెమ్మస్‌‌తో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించిన సింగరేణి, కాలానుగుణంగా కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఉత్పత్తిలో అనేక కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. బొగ్గు ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమైన 1889లో ఏటా 59వేల 671 టన్నుల బొగ్గు తవ్విన కంపెనీ, ప్రస్తుతం 28 అండర్​గ్రౌండ్​ బొగ్గుగనులు, 18 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల ద్వారా 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంతో దూసుకుపోతున్నది.



భూమి పొరల్లో దాగి ఉన్న నల్లబంగారు మాగాణిని వెలికి తీస్తూ సిరులను కురిపిస్తున్న సింగరేణికి సంబంధించిన ముఖ్య ఘట్టాలు. 1871లో బ్రిటిష్‌ హయాంలో జియోటాజికల్‌ సర్వే ఇండియాకు చెందిన డాక్టర్‌ కింగ్‌ జార్జ్‌ అప్పటి ఖమ్మం జిల్లా ఇల్లెందు సమీపంలోని బొగ్గుట్టలో బొగ్గు నిల్వలను కనుగొన్నారు. 1886లో బ్రిటిష్‌ ఇండియాలోని హైదరాబాద్‌ డెక్కన్‌ కంపెనీ లిమిటెడ్‌ ఇల్లెందులో బొగ్గు వెలికితీత కోసం అనుమతి పొందింది. 1889లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమయ్యింది. 1920 డిసెంబర్‌ 23న ది సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌గా అవతరించింది. 1945లో సింగరేణి కంపెనీలోని మెజారిటీ వాటాను హైదరాబాద్‌ రాష్ట్రం కొనుగోలు చేసింది. 1949లో హైదరాబాద్‌ ప్రభుత్వం ఈ కంపెనీని ఇండస్ట్రీయల్‌ ఫండ్‌ ట్రస్ట్‌కు అప్పగించింది. 1956లో ఉమ్మడి రాష్ట్ర అవతరణ తర్వాత కంపెనీల చట్టం ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థగా మార్పు చెందింది. 1960లో మూడో పంచవర్ష ప్రణాళిక కాలంలో కంపెనీని విస్తరించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈక్విటీ, రుణ సాయం పెంచడంతో కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి సంస్థగా మారింది. 1974లో కేంద్రప్రభుత్వం కంపెనీ మూల ధన వాటాను కేంద్ర బొగ్గు గనుల సంస్థకు బదిలీ చేసింది. అదే ఏడాది కేంద్రం, రాష్ట్రం, సింగరేణి సంస్థ మధ్య ఒప్పందం జరిగింది. ప్రస్తుతం సింగరేణిలో కేంద్రం వాటా 49 శాతం, రాష్ట్రం వాటా 51 శాతంగా ఉంది. ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సంస్థగా సింగరేణి కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది. 



-సప్తగిరి గోపగాని, చీఫ్‌ సబ్‌ఎడిటర్‌, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి

Updated Date - 2020-12-23T01:26:15+05:30 IST