సింగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆరుగురికి తీవ్ర జ్వరం..
ABN , First Publish Date - 2020-03-24T16:53:16+05:30 IST
కరోనా కలకలం రేపింది...

హైదరాబాద్/పంజాగుట్ట : ఖైరతాబాద్ ఆనంద్‌నగర్ కాలనీలో కరోనా కలకలం రేపింది. ఈనెల 21న సింగపూర్ నుంచి నగరానికి వచ్చిన ఆరుగురులో ముగ్గురికి సోమవారం తీవ్ర జ్వరం, దగ్గు, వాంతులు కావడంతో జీహెచ్‌ఎంసీ, ఇతర విభాగాల అధికారులకు సమాచారం అందించారు. దీంతో ప్రత్యేక బృందాలు అంబులెన్స్‌తో వచ్చి వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు, మరొకరు సింగపూర్ నుంచి నగరానికి వచ్చారు. విమానాశ్రయంలో వారికి పరీక్ష నిర్వహించారు.
స్టాంపింగ్ కూడా వేశారు. ఇంట్లో క్వారంటైన్‌గా ఉండాలని సూచించారు. దీంతో వారు ప్రత్యేక వాహనంలో ఇంటికి చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ఓ వృద్ధురాలికి, ఇద్దరు చిన్నారులకు తీవ్ర జ్వరం రావడమే కాకుండా విపరీతంగా దగ్గు, వాంతులు అయ్యాయి. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా, పరిసరాల్లో మందులను పిచికారి చేశారు.