నిశ్శబ్దంగా మసీదులు!

ABN , First Publish Date - 2020-04-26T08:44:29+05:30 IST

రంజాన్‌ వచ్చిందంటే చాలు.. ముషీరాబాద్‌లోని భోలక్‌ఫూర్‌ బడీ మసీదులో..

నిశ్శబ్దంగా మసీదులు!

  • సామూహిక ప్రార్థనలు బంద్‌
  • భోలక్‌పూర్‌ బడీ మసీదుకు తాళం

ముషీరాబాద్‌/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): రంజాన్‌ వచ్చిందంటే చాలు.. ముషీరాబాద్‌లోని భోలక్‌ఫూర్‌ బడీ మసీదులో సందడే సందడి. మక్కా మసీదు పరిసర ప్రాంతాలను తలపించేలా ఇక్కడ సామూహిక ప్రార్థనలు, ఇఫ్తార్‌ విందులు జరిగేవి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇప్పుడా వాతావరణమే లేదు. బడీ మసీదుకు 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఇదే గాక మరో 20 మసీదులు భోలక్‌పూర్‌లో ఉన్నాయి. రంజాన్‌ పవిత్ర మాసంలో బడీ మసీదులో 8-10 వేల మంది ముస్లింలు సామూహిక ప్రార్థనల్లో పాల్గొనేవారు. రద్దీ పెరిగి.. మసీదు ఆవరణలో టెంట్లు వేసిన సందర్భాలూ ఉన్నాయి. కరోనా మహమ్మారి కట్టడి కోసం సామూహిక ప్రార్థనలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో ఈ మసీదులన్నీ మూతపడ్డాయి. ఈ సారి రంజాన్‌ తొలి రోజు అయిదుగురు మాత్రమే ప్రార్థనలకు హాజరయ్యారు. ఇమామ్‌, మసీదు ముతావలీ, మరో ముగ్గురు పాల్గొన్నారు. 


70 ఏళ్లలో ఇదే తొలిసారి..

తన 70 ఏళ్ల సర్వీసులో బడీ మసీదు ఎన్నడూ మూతపడలేదని ముతావలీ నజీర్‌అలీ తెలిపారు. ‘మా తాత, ముత్తాతలు ఇదే మసీదులో విధులు నిర్వహించారు. రంజాన్‌ మాసంలో ఈ మసీదు మూతపడిన సందర్భం లేదు. కరోనా మహమ్మారి వల్ల సామూహిక ప్రార్థనలు జరపకుండా మసీదుకు తాళం వేశాం. స్థానికులు కూడా సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని అందరినీ కోరాం’ అని ఆయన చెప్పారు.

Updated Date - 2020-04-26T08:44:29+05:30 IST