అడవిలో అన్నల అలజడి

ABN , First Publish Date - 2020-03-13T11:31:34+05:30 IST

మానుకోట జిల్లా ఏజన్సీలో అన్నల అలజడి ఆరంభమైంది... పొరుగు రాష్ట్రం నుంచి తెలంగాణలోకి

అడవిలో అన్నల అలజడి

మూడు రోజులుగా జల్లెడ పడుతున్న పోలీసులు

జిల్లా నుంచి అజ్ఞాతంలో ఏడుగురు మావోలు


మహబూబాబాద్‌, ఆంధ్రజ్యోతి : మానుకోట జిల్లా ఏజన్సీలో అన్నల అలజడి ఆరంభమైంది... పొరుగు రాష్ట్రం నుంచి తెలంగాణలోకి మావోయిస్టులు కాలుమోపారన్న ఇంటలిజెన్స్‌ విభాగాల హెచ్చరికలతో ఒక్కసారిగా జిల్లా పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. 16 మండలాలతో ఆవిర్భవించిన మహబూబాబాద్‌ జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ కొత్తగూడ, గంగారం, గూడూరు, బయ్యారం మండలాల్లోని గ్రామాల్లో  పోలీసుల బూట్ల చప్పుళ్లకు ఏజెన్సీవాసులు బిక్కుబిక్కుమంటున్నారు. మహబూబాబాద్‌ జిల్లా నుంచి ఏడుగురు మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని పోలీసులు వారి తలలపై ఉన్న పారితోషికంతో కూడిన వాల్‌పోస్టర్లను ఆయా మండలాలు, గ్రామాల్లో విస్తృతంగా అంటిస్తూ సమాచారమిచ్చిన వారికి నజరానా ఉంటుందని పిలుపునిస్తున్నారు.


పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ నెట్‌వర్క్‌ను అలర్ట్‌ చేసి ఎప్పటికప్పుడు కొత్త వారేవరైన గ్రామాలు, కోయ గూడాలకు వచ్చారా అని ఆరా తీస్తున్నారు. జిల్లాలో గంగారం మండలం మడగూడానికి చెందిన యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా ఉండడంతో జిల్లా పోలీసులు పూర్తిగా ఆ మండలంతో పాటు ఆనుకుని ఉన్న కొత్తగూడ మండలంపై  దృష్టి కేంద్రీకరించారు. తాజాగా జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి నాలుగు మండలాల పోలీసులతో ఎప్పటికప్పుడు అప్రమత్తతో కూడిన హెచ్చరికలను జారీ చేస్తూ ఆయా పోలీ్‌సస్టేషన్‌లో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. 


జిల్లాలోని ఏజెన్సీ మండలాలకు ఇరుగు..పొరుగున ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములుగు జిల్లా, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో ఇప్పటికే పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమై ఉండగా మహబూబాబాద్‌ జిల్లాలో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు అటవీప్రాంతాల్లో కూంబింగ్‌ విస్తృతం చేశారు. తనిఖీలు, కార్డన్‌సెర్చ్‌లు కొనసాగిస్తున్నారు. గురువారం నాడు మావోయిస్టు అగ్రనేత యాప నారాయణ స్వగ్రామమైన గంగారం మండలం మడగూడెంకు ట్రైనీ ఐపీఎస్‌ అధికారి యోగే ష్‌ గౌతమ్‌ వెళ్లారు.


అక్కడే నివాసముంటున్న యాప నారాయణ తండ్రి రంగయ్యను కలిసి నీ బిడ్డను లొంగిపొమ్మని చెప్పమని అభ్యర్థించారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ స్టేట్‌ కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్‌ హరిభూషన్‌ అలియాస్‌ ఆజాద్‌ను కేంద్ర బిందువుగా చేసుకుని జిల్లా పోలీసులు కొత్తగూడ, గంగారం మండలాల గ్రామాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. కొత్తవారి కదలిక కన్పిస్తే చాలు తమకు సమాచారమివ్వాలని ఇన్‌ఫార్మర్‌ నెట్‌వర్క్‌ వ్యవస్థను పురమాయిస్తున్నారు. మొత్తానికి ఆయా ఏజెన్సీ మండలాల్లో పోలీసుల పదగట్టంతో  ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న రీతిలో ప్రజలు భయం..భయంగా బిక్కు.. బిక్కుమంటు గడుపుతున్నారు.

Updated Date - 2020-03-13T11:31:34+05:30 IST