ప్రభుత్వాస్పత్రుల్లో ‘ప్రసవ’ వేదనే!

ABN , First Publish Date - 2020-12-25T07:29:15+05:30 IST

ప్రభుత్వాస్పత్రులకు వెళ్లే నిండు గర్భిణులకు ‘ప్రసవ’ వేదనే మిగులుతోంది! నెలలు నిండిన గర్భిణులు సమీపంలోని సర్కారీ దవాఖానాకు వెళ్తే..

ప్రభుత్వాస్పత్రుల్లో ‘ప్రసవ’ వేదనే!

రాష్ట్రవ్యాప్తంగా గైనకాలజిస్టుల కొరత

ఉన్న పోస్టులే తక్కువ

వాటిలోనూ సగం ఖాళీయే!

భారమంతా కొద్దిమంది వైద్యులపైనే

కొన్ని చోట్ల గర్భిణులకు తీవ్ర ఇక్కట్లు 

కనీసం బెడ్లు కూడా ఇవ్వని దుస్థితి

150 పడకలున్న ఆసిఫాబాద్‌ 

ఆస్పత్రిలో ఒక్క గైనాకాలజిస్టు లేరు


(ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌)

ప్రభుత్వాస్పత్రులకు వెళ్లే నిండు గర్భిణులకు ‘ప్రసవ’ వేదనే మిగులుతోంది! నెలలు నిండిన గర్భిణులు సమీపంలోని సర్కారీ దవాఖానాకు వెళ్తే.. సుఖంగా ప్రవసవమై తిరిగి వస్తారన్న ఆశ లేకుండా పోతోంది! పురిటి నొప్పులతో ఆస్పత్రులకు వెళ్లిన వారికి పుట్టెడు దుఃఖం మిగులుతోంది! సమయానికి ప్రసూతి వైద్యులు లేక, సిబ్బంది పట్టించుకోక.. మరుగుదొడ్లలో, ఆస్పత్రి ప్రాంగణంలో ఆరుబయట.. బిడ్డలకు జన్మనిస్తున్న దయనీయ పరిస్థితి! అదృష్టం బాగుంటే పసికందుల ఊపిరి నిలుస్తుంది.. లేదంటే పుట్టిన వెంటనే కన్నుమూయడంతో.. నవమాసాలు మోసి, కన్న తల్లికి తీరని వేదనే మిగులుతుంది! ఇదీ రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో పరిస్థితి. 


రాష్ట్రవ్యాప్తంగా సర్కారీ దవాఖానాల్లో ప్రసూతి వైద్యుల కొరతతో పేద ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. చాలా ఆస్పత్రుల్లో సరిపడినంత మంది గైనకాలజిస్టులు లేరు. ఈ వైద్యుల పోస్టులే తక్కువగా ఉన్నాయనుకుంటే వాటిలోనూ సగం ఖాళీలే ఉంటున్నాయి.


ఫలితంగా పేద ప్రజలకు సరైన వైద్య సేవలు అందడం లేదు. తాండూరు (వికారాబాద్‌ జిల్లా ఆస్పత్రి) ఆస్పత్రికి కాన్పు కోసం వచ్చిన గర్భిణికి సరైన వైద్యం అందకపోవడంతో ఆమె మరుగుదొడ్డిలో ప్రసవించి.. బిడ్డను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆస్పత్రికి వచ్చిన ఆ గర్భిణికి కనీసం ఓ పడకను కూడా కేటాయించలేదు. అక్కడ ప్రసూతి వైద్యులూ అందుబాటులో లేరు.


ముగ్గురు కాంట్రాక్ట్‌ గైనకాలజిస్టులతో ఆస్పత్రిని నెట్టుకొస్తున్నామని సూపరింటెండెంట్‌ చెప్పడం గమనార్హం. రాష్ట్రంలోని చాలా ఆస్పత్రుల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. అనేక దవాఖానాల్లో సరిపడినన్ని వైద్యుల పోస్టులు లేవు. ఒకవేళ వైద్యుల్ని నియమించినా.. వారు పనిచేయడం లేదు. డిప్యుటేషన్‌పై ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో పాటు మెడికల్‌ లీవ్‌ పేరిట విధులకు హాజరవడం లేదు. ఇలా అనేక కారణాలతో చాలా ఆస్పత్రుల్లో అవసరమైనంత మంది వైద్యులు ఉండడం లేదు. ముఖ్యంగా గైనకాలజిస్టుల కొరత తీవ్రంగా ఉంది. వైద్య కళాశాల ఆస్పత్రుల వంటి వాటిలో మినహా మిగిలిన జిల్లా ఆస్పత్రులు, కమ్యూనిటీ సెంటర్లతో పాటు వైద్యవిధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో పరిస్థితి దారుణంగా ఉంది. వైద్యుల కొరత వల్ల ఉన్న కొద్ది మందిపై పనిభారం పెరిగిపోతోంది. 


జిల్లాల్లో పరిస్థితులివీ..

  • ఆసిఫాబాద్‌లో 150 పడకల ఆస్పత్రి ఉంది. ఇక్కడ 15 మంది డాక్టర్లు ఉండాలి. కానీ, ఉన్నది ముగ్గురే. ఇందులోనూ ఇద్దరు జూనియర్‌ డాక్టర్లు. ఒక్క గైనకాలజిస్టు కూడా లేరు. కాగజ్‌నగర్‌ ఆస్పత్రికి గైనకాలజిస్టు పోస్టు మంజూరైనప్పటికీ అక్కడ పని చేసేందుకు ఎవరూ రావడం లేదు.  ఫలితంగా మంచిర్యాల, జైనూర్‌, సిర్పూర్‌(యు), లింగాపూర్‌ వంటి ఏజెన్సీ ప్రాంతాల నుంచి ప్రసూతి సేవల కోసం ఆదిలాబాద్‌ రిమ్స్‌కు వెళ్తున్నారు. 
  • నాగర్‌కర్నూల్‌ ఆస్పత్రిలో రోజూ దాదాపు 10మంది కాన్పుల కోసం వస్తుంటారు. 8 మంది గైనకాలజిస్టులు అవసరం ఉండగా.. ప్రస్తుతం ముగ్గురే ఉండడంతో వారిపైనే భారం పడుతోంది. 
  • నిజామాబాద్‌ ఆస్పత్రిలో రోజూ 20-30 మందికి కాన్పులు చేస్తున్నారు. 12 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట 8 మందే ఉన్నారు.
  • ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో ప్రసూతి  వైద్యులు 18 మంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 9 మందే ఉన్నారు. వీరిలో ఒక్కరే రెగ్యులర్‌ వైద్యులు. నెలకు 500-600 వరకు కాన్పులు జరుగుతాయి.
  • నిర్మల్‌ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. జిల్లా కేంద్రం మినహా మిగతా చోట్ల స్త్రీ వైద్య నిపుణుల కొరత తీవ్రంగా ఉండడంతో ప్రభుత్వాస్పత్రికి వచ్చే గర్భిణులు, ఇతర వ్యాధులున్న మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖానాపూర్‌ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి. ఈ ఆస్పత్రికి ముగ్గురు స్త్రీ వైద్యనిపుణుల పోస్టులు మంజూరవగా మూడూ ఖాళీగా ఉన్నాయి. ప్రసూతి కేంద్రంలో విధులు నిర్వహించాల్సిన వైద్యురాలి సేవలను ఖానాపూర్‌ ప్రభుత్వాస్పత్రిలో వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం నెలకు సగటున 28-35 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. 
  • భైంసాలో 3 గైనకాలజీ పోస్టుల మంజూరు ఉండగా ప్రస్తుతం ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ నెలకు సగటున 200 వరకు కాన్పులు జరుగుతున్నాయి. వీటితో పాటు పెంబి నర్సాపూర్‌(జి) లాంటి ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో సైతం ప్రసవాలు చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రులన్నింట్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. గైనకాలజిస్టుల కొరత కారణంగా ప్రభుత్వాస్పత్రిలో కేవలం గర్భిణులకు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇతర మహిళలకు ప్రైవేటు ఆస్పత్రులే దిక్కవుతున్నాయి. 
  • మెదక్‌ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో గైనకాలజి్‌స్టలు 8 మంది ఉండాలి. కానీ, ప్రస్తుతం నలుగురే పనిచేస్తున్నారు. ఇందులో ఒకరు రెగ్యులర్‌, ఒకరు కాంట్రాక్టు, మరో ఇద్దరు డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. నెలకు సుమారు 350 కాన్పులు చేస్తున్నారు. 
  • కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఐదుగురు ప్రసూతి వైద్యులు ఉండాలి. కానీ, ప్రస్తుతం ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఇందులో ఒక్కరు రెగ్యులర్‌గా ఉండగా మరో ఇద్దరు డిప్యుటేషన్‌పై పని చేస్తున్నారు. ఈ ఆస్పత్రిలో రోజూ 15 వరకు కాన్పులు అవుతున్నాయి. 
  • గద్వాల జిల్లా ప్రధాన ఆస్పత్రిలో నలుగురు గైనకాలజిస్టులు ఉండగా, ఇందులో ఒకరు మెడికల్‌ లీవ్‌లో ఉన్నారు.

నల్లగొండలోని ఆస్పత్రి వైద్య కళాశాలకు అనుబంధంగా ఉంది. రోజూ 15-20 ప్రసవాలు జరుగుతాయి. ప్రస్తుతం 11 మంది ప్రసూతి వెద్యులు ఉన్నారు. ఇంకా ఆరుగురు అవసరం. సర్జికల్‌ బడ్జెట్‌ ప్రతి నెలా రూ.3 లక్షలు వస్తుంది. ఇది సరిపోకపోవడంతో రూ.6 లక్షలు మంజూరు చేయాలంటూ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. 


మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రిలో రోజూ సగటున 25-30 ప్రసవాలు జరుగుతాయి. ఆరుగురు ప్రసూతి వైద్యులు, ముగ్గురు అనస్తీషియా వైద్యులు పనిచేస్తున్నారు. డెలివరీల సంఖ్య ఎక్కువగా ఉండడంతో మరో నలుగురు వైద్యులు కావాల్సి ఉంది. ఏడాది కిందట గర్భిణీకి వైద్యం అందకపోవడంతో ఆమె రోడ్డుపైనే ప్రసవించాల్సి వచ్చింది. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వనపర్తి జిల్లా ఆస్పత్రిలో ప్రస్తుతం ఐదుగురు గైనకాలజిస్టులు ఉన్నా.. వీరిలో ముగ్గురు మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన ఇద్దరు మెడికల్‌ లీవ్‌ పెట్టుకున్నారు. దాంతో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు 24 గంటల చొప్పున ఒక్కొక్కరు విధులకు హాజరవుతున్నారు. అల్ర్టా సౌండ్‌ స్కానింగ్‌ యంత్రం అత్యవసరంగా కావాల్సి ఉంది. 

Updated Date - 2020-12-25T07:29:15+05:30 IST