విద్యపై చిన్నచూపా?

ABN , First Publish Date - 2020-03-16T09:16:44+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంపై చిన్నచూపు చూస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు

విద్యపై చిన్నచూపా?

సర్కారు బడుల్లో సౌకర్యాల లేమి

విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలి

గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ఇవ్వండి: భట్టి  

హైదరాబాద్‌, మార్చి 15(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంపై చిన్నచూపు చూస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవన్నారు. ఆదివారం శాసనసభలో పలు పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని, తద్వారా ప్రైవేట్‌ స్కూళ్లలోని 25ు సీట్లు పేద విద్యార్థులకు దక్కుతాయని చెప్పారు. ఐఏఎస్‌ అధికారులను ఇన్‌చార్జీ  వైస్‌చాన్సలర్లుగా నియమించడం వల్ల వర్సిటీల్లో పాలన సరిగా జరగడం లేదన్నారు. డిగ్రీ, ఇంటర్‌ ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులు చేరడం లేదని, ప్రభుత్వ కాలేజీల్లో చేరే విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు. హైదరాబాద్‌లో అనుమతిలేని కార్పొరేట్‌ పాఠశాలలు యథేచ్ఛగా నడుస్తున్నాయని, వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.


గురుకుల పాఠశాలల భవనాలు ప్రమాదకరంగా ఉన్నాయని, చాలా ప్రాంతాల్లో ప్రత్యేక భవనాలు లేవని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను గురుకులాల భవనాల నిర్మాణాలకు ఉపయోగించాలన్నారు. మిషన్‌ భగీరథకు రూ.42 వేల కోట్ల ఖర్చుపెట్టారని గొప్పలు చెబుతున్నారని, తన మధిర నియోజకవర్గంలోని గ్రామాల్లో ఇంకా నీళ్లు రాలేదన్నారు. గ్రూప్‌-1, 2 నోటిషికేషన్లను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.  మరోవైపు.. విద్యాహక్కు చట్టంలోని నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు భట్టివిక్రమార్క లేఖ రాశారు. 


కరోనా నివారణకు మద్దతు 

కరోనా వైరస్‌ విషయంలో వాస్తవాలను ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని, జాగ్రత్తలు తీసుకునేవిధంగా అవగాహన కల్పించాలని భట్టి విక్రమార్క అన్నారు. కరోనా భారి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని సూచనలు చేస్తున్నామని, ప్రభుతాన్ని విమర్శించడానికో, ఎత్తిచూపడానికో కాదన్నారు. రాష్ట్రంలో కరోనా ప్రబలకుండా ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వానికి పూర్తిగా మద్దతిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు.  


సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై స్పీకర్‌కు ఫిర్యాదు 

కరోనా వైర్‌సపై శాసనసభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడిన తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డికి సీఎల్పీ నేత  భట్టివిక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క ఫిర్యాదు చేశారు. సీఎం తీరును నియంత్రించాలని ఆదివారం స్పీకర్‌ చాంబర్‌లో ఆయనను కలిసి కోరారు. కాంగ్రెస్‌ పార్టీని కరోనా వైర్‌సతో సీఎం కేసీఆర్‌ పోల్చడం, శవాలపై పేలాలు ఏరుకుంటున్నారంటూ మాట్లాడడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. సభానాయకుడు మాట్లాడేది అలాగేనా అని ప్రశ్నించారు. 

 

కరోనా రాకుండా జాగ్రత్తగా ఉండాలని సీఎంకు చెప్పు

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో భట్టి సరదా సంభాషణ

‘‘కాంగ్రెస్‌ను కరోనా అంటే ఎట్లా? కాంగ్రెస్‌ కరోనా అయితే సీఎం కేసీఆర్‌ను జాగ్రత్తగా ఉండమని చెప్పు. కాంగ్రెస్‌ నుంచే వెళ్లిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వనమా వెంకటేశ్వర్‌రావు ఇప్పుడు ఆయన పక్కనే ఉన్నారు. ఆయనకు కరోనా రాకుండా చూసుకోమను’’ అని భట్టివిక్రమార్క టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో సరదాగా అన్నారు. అంతకుముందు.. దేశానికి పట్టిన అసలు కరోనా కాంగ్రెస్సేనని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మీడియా పాయింట్‌లో అన్నారు. కరోనాపై ప్రభుత్వం ముంద స్తు చర్యలు తీసుకుంటుండగా.. భట్టివిక్రమార్క విమర్శలు చేయడం సరికాదన్నారు. 

Updated Date - 2020-03-16T09:16:44+05:30 IST