ప్రముఖ చిత్రకారుడు శంకరనారాయణ కన్నుమూత

ABN , First Publish Date - 2020-07-10T09:01:55+05:30 IST

ప్రముఖ చిత్రకారుడు శంకరనారాయణ కన్నుమూత

ప్రముఖ చిత్రకారుడు శంకరనారాయణ కన్నుమూత

అంతర్జాతీయ ఖ్యాతి పొందిన బాపు సోదరుడు


బెంగళూరు, హైదరాబాద్‌ సిటీ, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పోర్ట్‌రెయిట్‌ కళాకారుడు, సినీ దర్శకుడు బాపు సోదరుడు అయిన సత్తిరాజు శంకరనారాయణ(84) కన్నుమూశారు. ఊపిరితిత్తుల సమస్యతో కొద్దికాలంగా బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. శంకరనారాయణ తన రేఖాచిత్రాలతో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించారు. 1936లో పశ్చిమగోదావరి జిల్లా నరసాపూర్‌లో ఆయన జన్మించారు. 1963లో ఆల్‌ ఇండియా రేడియోలో చేరి మూడు దశాబ్దాలకుపైగా పనిచేసి.. 1995లో చెన్నైలోని ఆల్‌ ఇండియా రేడియోలో స్టేషన్‌ డైరెక్టర్‌ హోదాలో పదవీ విరమణ పొందారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడున్నారు.  ప్రముఖ దర్శకుడు వీరాముళ్ళపూడిని అల్లుడిగా చేసుకోవడం ద్వారా ముళ్ళపూడి వెంకటరమణ కుటుంబంతో వియ్యమందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఏఐసీసీ ప్లీనరీ జరిగిన సమయంలో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు చిత్రాన్ని శంకరనారాయణ తొలి పోర్ట్‌రెయిట్‌గా మలిచారు. అనంతరం వేల సంఖ్యలో పోర్ట్‌రెయిట్‌లను గీశారు. తాను గీసిన రేఖాచిత్రాలతో కూడిన ఐదు పుస్తకాలను వెలువరించారు. ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక కోసం ఆయన పలు పోర్ట్‌రెయిట్‌లు గీశారు.

Updated Date - 2020-07-10T09:01:55+05:30 IST