మత్తిచ్చి.. యువతిపై వృద్ధుడి లైంగిక దాడి

ABN , First Publish Date - 2020-05-10T10:01:22+05:30 IST

అతడు ఎనభై ఏళ్ల వృద్ధుడు. అమాయకులై పేద యువతులకు ఆర్థికసాయం పేరుతో వల విసిరి, ఆపై లైంగిక దాడికి పాల్పడుతుంటాడు. తాజాగా సాయం చేస్తాడని నమ్మి...

మత్తిచ్చి.. యువతిపై వృద్ధుడి లైంగిక దాడి

సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన ప్రేమికుడు

లాక్‌డౌన్‌ వేళ హైదరాబాద్‌లో దారుణం.. 

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన


 బంజారాహిల్స్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): అతడు ఎనభై ఏళ్ల వృద్ధుడు. అమాయకులై పేద యువతులకు ఆర్థికసాయం పేరుతో వల విసిరి, ఆపై లైంగిక దాడికి పాల్పడుతుంటాడు. తాజాగా సాయం చేస్తాడని నమ్మి ఇంటికొచ్చిన తన మనవరాలి వయసున్న ఓ యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ యువతి పోలీసులను ఆశ్రయించడంతో అతడి కామ పురాణం బయటపడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో జరిగింది. ఎమ్మెల్యే కాలనీలో నివాసముండే మహ్మద్‌ సలీముద్దీన్‌ (80)కు ఇద్దరు భార్యలు. ఇతడి నిజ స్వరూపం తెలియని ఓ యువతి.. తన ప్రేమికుడితో వివాహం జరిపించమని అడగడానికి అతడి ఇంటి తలుపుతట్టింది. తప్పకుండా సాయం చేస్తానని, లాక్‌డౌన్‌ ఎత్తేసే వరకు తన ఇంట్లోనే ఉండమని నమ్మబలికాడు. అతడు బంధువు కూడా కావడంతో ఆ యువతి నమ్మింది. తన ప్రేమికుడితో కలిసి ఆ ఇంట్లోనే ఉండిపోయింది. ఓ రోజు సలీముద్దీన్‌.. ఆ యువతి ప్రేమికుడితో కలిసి మద్యం తాగాడు.


ఆ సమయంలో యువతికి కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి తాగించాడు. ఆమె మత్తులో ఉండగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దృశ్యాలను యువతి ప్రేమికుడు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని యువతి బెదిరించింది. ఈనేపథ్యంలో తన ఖరీదైన వాచ్‌ను ఆ యువతే తీసిందంటూ వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో హతాశురాలైన ఆ యువతి.. తనకు జరిగిన అన్యాయాన్ని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ను కలిసి వివరించింది. దీంతో ఆమెను వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. సలీముద్దీన్‌, ఆ యువతి ప్రేమికుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

Updated Date - 2020-05-10T10:01:22+05:30 IST