హైకోర్టులో గ్లోబల్‌ ఆస్పత్రికి ఊరట

ABN , First Publish Date - 2020-08-18T08:07:58+05:30 IST

గ్లోబల్‌ ఆసుపత్రికి హైకోర్టులో ఊరట లభించింది. కొవిడ్‌ చికిత్సకు అధిక చార్జీలు వసూలు

హైకోర్టులో గ్లోబల్‌ ఆస్పత్రికి ఊరట

  • ప్రభుత్వ నోటీసులు కొట్టివేత
  • చట్ట ప్రకారం గడువు ఇవ్వాలి:బెంచి

హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): గ్లోబల్‌ ఆసుపత్రికి హైకోర్టులో ఊరట లభించింది. కొవిడ్‌ చికిత్సకు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారనే అభియోగాలపై ఆసుపత్రికి గతంలో మంజూరైన లైసెన్సులు వాపస్‌ ఇవ్వాలంటూ జారీ చేసిన రెండు నోటీసులను హైకోర్టు కొట్టివేసింది. కేసు వేసిన ఆసుపత్రికి వివరణ ఇచ్చేందుకు తగిన సమయం ఇవ్వకుండా ఏకపక్షంగా లైసెన్సులు సరెండర్‌ చేయాలంటూ నోటీసులు జారీచేయడం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. చట్ట ప్రకారం నోటీసులకు తగిన గడువు ఇచ్చి, ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలితే చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని గుర్తుచేసింది. ఈ మేరకు హైకోర్టు సీజే రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఆదేశాలు జారీచేసింది. కొవిడ్‌ చికిత్సకు అధిక బిల్లులు వసూలు చేస్తున్నారనే అభియోగాలపై హైదరాబాద్‌లోని గ్లోబల్‌ ఆసుపత్రి యాజమాన్యానికి వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు జూలై 30న, ఆగస్టు 10న నోటీసులు జారీచేశారు. ఈ నోటీసులను సవాల్‌ చేస్తూ ఆసుపత్రి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. పిటిషనర్‌ తరఫున వాదనలు విన్న ధర్మాసనం... చట్ట ప్రకారం ఆసుపత్రికి నోటీసులు జారీచేసి తగిన గడువు ఇవ్వాలని స్పష్టం చేసింది. వైద్య, ఆరోగ్య శాఖ జారీచేసిన రెండు నోటీసులను రద్దు చేసింది. నిబంధనల ప్రకారం తాజాగా చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది. 

Updated Date - 2020-08-18T08:07:58+05:30 IST