అన్నం పెట్టిన ఇంటికే కన్నం
ABN , First Publish Date - 2020-08-11T09:20:40+05:30 IST
అన్నం పెట్టిన ఇంటికే వారు కన్నం వేశారు. పనితీరు బాగాలేదని పనిలో నుంచి తొలగిస్తే.. యజమాని ఇంట్లోనే చోరీకి పాల్పడ్డారు. టోలిచౌకిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో పనిచేసి

టోలిచౌకి రియల్టర్ ఇంట్లో దోపిడీకి.. పాల్పడ్డది పనిచేసి మానేసినవారే
ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): అన్నం పెట్టిన ఇంటికే వారు కన్నం వేశారు. పనితీరు బాగాలేదని పనిలో నుంచి తొలగిస్తే.. యజమాని ఇంట్లోనే చోరీకి పాల్పడ్డారు. టోలిచౌకిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో పనిచేసి మానేసిన ఇద్దరు యువకులు.. మరో ముగ్గురు స్నేహితులతో కలిసి దోపిడీ చేశారు. ఐదుగురు సభ్యుల ఈ ముఠాను గోల్కొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1.29 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, వెస్ట్‌జోన్ జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్ సోమవారం ఈ వివరాలు వెల్లడించారు. టోలీచౌకిలోని బాల్‌రెడ్డినగర్ నివాసి అయిన అసదుద్దీన్ అహ్మద్(54) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. జూలై 21న ఆస్తి లావాదేవీలకు సంబంధించిన నగదుతోపాటు బ్యాంకు నుంచి విత్‌డ్రా చేసిన డబ్బును ఇంట్లో పెట్టి.. భార్యాపిల్లతో కలిసి శామీర్‌పేటలోని తన ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. అక్కడినుంచి జూలై 23న ఇంటికి తిరిగివచ్చేసరికి చోరీ జరిగింది. డబ్బులు మాయమైనట్లు గుర్తించిన అసదుద్దీన్.. 27న గోల్కొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సుమారు రూ.2.5 కోట్లు చోరీకి గురైనట్లు పేర్కొన్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసదుద్దీన్ వద్ద ఇంతకుముందు కారు డ్రైవర్‌గా మహమ్మద్ అఫ్సర్ (24), ఫామ్‌హౌస్‌లో మీర్జా అష్ఫాక్ బేగ్ (22) పనిచేసేవారు. అయితే పనితీరు సరిగా లేకపోవడంతో అసదుద్దీన్ వీరిని తీసివేశారు. దీంతో అఫ్సర్, అష్ఫాక్ యజమాని ఇంట్లో చోరీ చేయాలని నిర్ణయించు కున్నారు. తమ స్నేహితులైన రహ్మాన్బేగ్ (23), మహమ్మద్ అమీర్ (20), సయ్యద్ ఇమ్రాన్ (23)లతో కలిసి జూలై 22 అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. డబ్బును రెండు సంచుల్లో నింపుకెళ్లి.. అమీర్ ఇంట్లో దాచి పెట్టారు. తెల్లవారు జామున కొంత డబ్బును పంచుకుని, మిగతా డబ్బును రెండు బ్యాగుల్లో అక్కడే దాచి పెట్టారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని రెండు బ్యాగుల్లో 1.29 కోట్ల నగదును, అవెంజర్ బైకును, ఓ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఫిర్యాదులో రూ.2.5 కోట్లు చోరీకి గురైనట్లు బాధితుడు పేర్కొనడం గమనార్హం.