వరుస మరణాలు.. నెలరోజుల్లో ఆరుగురి మృతి

ABN , First Publish Date - 2020-12-30T20:09:08+05:30 IST

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ముప్పనపల్లి ఎస్సీ కాలనీలో సంభవిస్తున్న వరుస మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో ఆరుగురు మృతి చెందడం, అందరికీ ఒకేరకమైన అనారోగ్య లక్షణాలు కనిపిస్తుండడం స్థానికులను కలవరపరుస్తోంది.

వరుస మరణాలు.. నెలరోజుల్లో ఆరుగురి మృతి
ముప్పనపల్లిలో కరోనా పరీక్షలు చేపిస్తున్న డీఎంహెచ్‌వో

కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి

ఎస్సీ కాలనీ వాసులకు అనారోగ్యం  

అందరికీ ఒకే విధమైన లక్షణాలు ఉండడంతో ఆందోళన 


కన్నాయిగూడెం/ములుగు (ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ముప్పనపల్లి ఎస్సీ కాలనీలో సంభవిస్తున్న వరుస మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో ఆరుగురు మృతి చెందడం, అందరికీ ఒకేరకమైన అనారోగ్య లక్షణాలు కనిపిస్తుండడం స్థానికులను కలవరపరుస్తోంది. నవంబర్‌ 24న తిప్పనపల్లి ఎర్రయ్య (35)  కడుపు ఉబ్బరం, విరేచనాలతో అస్వస్థతకు గురై మృతి చెందాడు. వైద్య పరీక్షలు నిర్వహించగా కాలేయం ఇన్‌ఫెక్షన్‌గా నిర్ధారణ అయ్యింది. 26న ఇదే కాలనీకి  చెందిన  లక్ష్మీనారాయణ (40), డిసెంబరు 4న పోశమ్మ(90), 5న దార కుమారి(35), 6న తిప్పనపల్లి రమేష్‌ (33), ఆయన కుమార్తె రాధిక (12) 19వ తేదీన మరణించారు. తల్లీ బిడ్డలిద్దరూ కూడా ఒకే రకమైన అనారోగ్య లక్షణాలతో మృతిచెందడంతో కాలనీలో కలకలం మొదలైంది.


కీడు సోకిందని బంధువుల ఇంటికి..

కాలనీకి కీడుసోకిందని భావించిన స్థానికులు బంధువుల ఇళ్లకు వెళ్తున్నారు. 60 ఇళ్లు  ఉన్న ఈ కాలనీలో 250 మందికి పైగా జనాభా ఉంది. వీరిలో సగం మందికి పైగా బంధువుల ఇళ్లకు వెళ్లారు. వృద్ధు లు, నడివయసు వారు మాత్రమే ఇక్కడ ఉన్నారు. దీనిపై  స్పందించి న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఈనెల 8న గ్రామాన్ని సందర్శించా రు. 18వ తేదీ నుంచి వరుసగా హెల్త్‌ క్యాంపులు నిర్వహిస్తున్నారు. 25న పరిస్థితిని స్వయంగా సమీక్షించిన డీఎంహెచ్‌వో అప్పయ్య ప్రజలు తాగుతున్న చేతి పంపు, మిషన్‌ భగీరథ నీటి శాంపిళ్లను సేకరించారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పారిశుధ్య చర్యలను ముమ్మరం చేశారు. ప్రజలు మూఢనమ్మకాలకు ప్రభావితులు అవుతుండటంతో భారత నాస్తికసంఘం ఆధ్వర్యంలో అవగాహన, చైతన్య కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో బుధ, గురువారాల్లో గ్రామంలో ఇంటింటా పూజలు, హనుమాన్‌ దేవాలయం లో హోమం నిర్వహించాలని పెద్దమనుషులు నిర్ణయించారు. ఈమేరకు ఏర్పాట్లు కూడాచేస్తున్నారు.


పరిస్థితి అదుపులోనే ఉంది: డాక్టర్‌ అల్లెం అప్పయ్య, డీఎంహెచ్‌వో

ప్రజలెవ్వరూ ఆందోళన చెంద వద్దని, కలుషిత ఆహారం తినడం ద్వారా డయేరియా సోకి మరణాలు సంభవించినట్లు నిర్ధారణ అయ్యింది. 10 రోజులుగా ప్రతీరోజు గ్రామంలో మెడికల్‌ క్యాంపు నిర్వహిస్తున్నాం. అనుమానితులకు మలేరియా, డెంగీ, కరోనా టెస్టులు చేసినా అందరికీ నెగెటివ్‌ వచ్చాయి. పలువురికి రక్త కణాల లెక్కింపు పరీక్షలు కూడా చేశాం. అత్యవసర సేవల కోసం 108 అం బులెన్స్‌ను గ్రామంలోనే అందుబాటులో ఉంచాం. ఇప్పటివరకైతే పరిస్థితి అదుపులోనే ఉంది. ప్రజలు పౌష్టికాహారం, కాచి వడబోసిన సురక్షిత నీటినే తాగాలి. 

Updated Date - 2020-12-30T20:09:08+05:30 IST