శ్రావణి ఆత్మహత్యకు రెండ్రోజుల ముందు...

ABN , First Publish Date - 2020-09-12T09:25:58+05:30 IST

బుల్లితెర నటి కొండపల్లి శ్రావణి (26) ఆత్మహత్య కేసు ఆమె స్నేహితులు దేవరాజ్‌రెడ్డి,

శ్రావణి ఆత్మహత్యకు రెండ్రోజుల ముందు...

అతడిని నిలదీసిన శ్రావణి కుటుంబసభ్యులు..

శ్రావణిని బజారుకీడుస్తానని దేవరాజ్‌ బెదిరింపులు

తర్వాత కూడా సన్నిహితంగా ఉన్న నటి 

ఒకసారి తలలు పగిలేలా  కొట్టుకున్న సాయి, దేవరాజ్‌

మరోసారి దేవరాజ్‌తో గొడవపడి  శ్రావణిని కొట్టిన సాయి

దేవరాజ్‌వల్లే శ్రావణి ఆత్మహత్య: సాయి

త్వరలో  ఆధారాలిస్తానని వెల్లడి


హైదరాబాద్‌ సిటీ, గొల్లప్రోలు, సెప్టెంబరు 11: బుల్లితెర నటి కొండపల్లి శ్రావణి (26) ఆత్మహత్య కేసు ఆమె స్నేహితులు దేవరాజ్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డి (సాయి) చుట్టూనే తిరుగుతోంది. ఈ ఇద్దరు ఒకట్రెండుసార్లు గొడవ పడ్డారని.. ఒకసారి పరస్పరం తలలు పగిలే స్థాయిలో కొట్టుకున్నట్లు తెలుస్తోంది. ఒకరినొకరు కొట్టుకుంటున్న దృశ్యాలు బయటపడ్డాయి. మరి.. దేవరాజ్‌, సాయి కొట్టుకునేందుకు కారణం ఏమైవుంటుంది? శ్రావణి కోసమే గొడవ పడ్డారా? అనేది తెలియాల్సి ఉంది.


అయితే టిక్‌టాక్‌ ద్వారా పరిచయమైన దేవరాజ్‌తో సన్నిహితంగా ఉన్న శ్రావణి, అతడిపై ప్రేమతో ఓ సెల్ఫీ వీడియోను తీసుకోవడమే తర్వాత పరిణామాలకు కారణమైందని తెలుస్తోంది. అతడితో కలిసి దిగిన ఆ వీడియోను కుటుంబ సభ్యులకు తెలియకుండా ఆమె జాగ్రత్త పడింది. కుటుంబ సభ్యులు మాత్రం దేవరాజ్‌పై ఆగ్రహంతో రగిలిపోయారు. పలుమార్లు దేవరాజ్‌ కూడా శ్రావణి కుటుంబ సభ్యులను బెదిరించాడు. శ్రావణిని కూడా రోడ్డుపైకి ఈడుస్తా? అంటూ బెదిరించాడు. విషయం తెలుసుకున్న శ్రావణి,  దేవరాజ్‌ను నిలదీసింది.


శ్రావణితో పాటు దేవరాజ్‌ను కలవడానికి ఆమె సోదరుడు, సోదరి, శ్రావణి బావ కూడా వచ్చారు. ఫొటోలు, వీడియోలపై కుటుంబ సభ్యులంతా దేవరాజ్‌ను నిలదీశారు. మాటా మాటా పెరిగి దేవరాజ్‌పై దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత దేవరాజ్‌  పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి శ్రావణి కుటుంబసభ్యులపై ఫిర్యాదు చేశాడు.

అదే సమయంలో దేవరాజ్‌పై శ్రావణి కూడా ఎస్సార్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో దేవరాజ్‌పై 354 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు.   దేవరాజ్‌ బెయిల్‌పై విడుదలైన కొన్నాళ్లకు అతడితో సన్నిహితంగా మెలిగింది. 


అంతా దేవరాజ్‌ వల్లే: సాయి

శ్రావణి ఆత్మహత్యకు దేవరాజ్‌రెడ్డి వేధింపులే కారణమని సాయి ఆరోపించాడు. శ్రావణి ఆత్మహత్య చేసుకున్న తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలు, వెలుగుచూస్తున్న విషయాలపై సాయి శుక్రవారం మీడియాతో మాట్లాడాడు. ఒక పథకం ప్రకారమే దేవరాజ్‌ తనవద్ద వీడియోలు, ఆడియో రికార్డింగ్‌లు ఉంచుకుని ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ తమను బద్నామ్‌ చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు.


ఆరేళ్లుగా తనకు శ్రావణి, ఆమె కుటుంబంతో పరిచయం ఉందని  చెప్పాడు. 2019, ఆగస్టులో  టిక్‌టాక్‌ ద్వారా శ్రావణికి దేవరాజ్‌ పరిచయమయ్యాడని, డిసెంబరులో అందరికీ ఈ విషయం చెప్పిందని చెప్పాడు. ఆమె ఇంట్లోనే ఉండి ఇతర అమ్మాయిలతో మాట్లాడేవాడని, ఈ విషయం తనకు శ్రావణి చెప్పడంతో దేవరాజ్‌ను మందలించినట్లు చెప్పాడు.

ఫోన్‌ డేటా, వీడియోలు, ఆడియో రికార్డింగ్‌లు తనవద్ద ఉన్నాయని పలుమార్లు  శ్రావణిని దేవరాజ్‌ బెదిరించాడన్నాడు. తాను ఎవ్వరినీ బ్లాక్‌మెయిల్‌ చేయలేదని, తాను సేఫ్‌గా ఉండాలని దేవరాజ్‌ ఇతరులపై బురద చల్లుతున్నాడని  చెప్పాడు. విచారణకు రావాలని పోలీసులు చెప్పారని, తాను త్వరలోనే హైదరాబాదులో పోలీసుల ఎదుట హాజరుకావడంతోపాటు తమవద్ద ఉన్న ఆధారాలు అన్నీ ఇస్తామని చెప్పాడు. 


ఆత్మహత్యకు రెండ్రోజుల ముందు.. 

ఆత్మహత్యకు రెండ్రోజుల ముందే పంజాగుట్ట శ్రీకన్య రెస్టారెంట్‌లో శ్రావణి, దేవరాజ్‌ కలుసుకున్నారు. అదే సమయంలో సాయికృష్ణ కూడా అక్కడికొచ్చాడు. అక్కడ దేవరాజ్‌, సాయికృష్ణ మద్య మాటామాట పెరిగి మళ్లీ గొడవ పడ్డారు. ఈ గొడవ జరిగాక శ్రావణిని కూడా సాయి కొట్టినట్లుగా ఓ వీడియో వైరల్‌ అయింది. అంతేకాదు కుటుంబసభ్యులు కూడా తనపై దాడి చేశారని శ్రావణి ఓ వీడియోలో వాపోయింది.


అసలు శ్రావణి ఆత్మహత్యకు దేవరాజ్‌ కారణమా? లేక సాయి కారణమా? కుటుంబ సభ్యులు కారణమా?.. ఆమె ఎందుకు  ఆత్మహత్య చేసుకుంది. ఎవరామెను ఇబ్బంది పెట్టారో తేల్చే పనిలో ఎస్సార్‌నగర్‌ పోలీసులు నిమగ్నమయ్యారు.  


Updated Date - 2020-09-12T09:25:58+05:30 IST