లక్ష్యంపై నిర్లక్ష్యం..

ABN , First Publish Date - 2020-12-16T04:42:41+05:30 IST

చెత్త సేకరణలో అధికారుల్లో చిత్తశుద్ధి కొరవడింది. ఫలితంగా సర్కారు లక్ష్యం నీరుగారుతోంది. విడివిడిగా తడి,పొడి చెత్తను సేకరించేందుకు ప్రభుత్వం ఇంటికి రెండు బుట్టలు అందించింది. సేకరించిన చెత్త నుంచి కంపోస్టు ఎరువు తయారు చేసేందుకు లక్షల రూపాయలు వెచ్చించి సెగ్రిగేషన్‌ షెడ్లు నిర్మించింది. అయితే వీటిపై ప్రజలకు అవగాహన లేక ఇప్పటికీ చెత్తను ఆరుబయటే పడేస్తున్నారు. ఫలితంగా సెగ్రిగేషన్‌ షెడ్లు నిరుపయోగంగా ఉంటున్నాయి.

లక్ష్యంపై నిర్లక్ష్యం..
కోలుకొండలో నిరుపయోగంగా ఉన్న సెగ్రిగేషన్‌ షెడ్డు

నిరుపయోగంగా ఉంటున్న సెగ్రిగేషన్‌ షెడ్లు

వృథా అవుతున్న ప్రజాధనం 

పట్టించుకోని పాలకులు, అధికారులు

చెత్త సేకరణలో కానరాని చిత్తశుద్ధి


 చెత్త సేకరణలో అధికారుల్లో చిత్తశుద్ధి కొరవడింది. ఫలితంగా సర్కారు లక్ష్యం నీరుగారుతోంది. విడివిడిగా తడి,పొడి చెత్తను సేకరించేందుకు ప్రభుత్వం ఇంటికి రెండు బుట్టలు అందించింది. సేకరించిన చెత్త నుంచి కంపోస్టు ఎరువు తయారు చేసేందుకు లక్షల రూపాయలు వెచ్చించి సెగ్రిగేషన్‌ షెడ్లు నిర్మించింది. అయితే వీటిపై ప్రజలకు అవగాహన లేక ఇప్పటికీ చెత్తను ఆరుబయటే పడేస్తున్నారు. ఫలితంగా సెగ్రిగేషన్‌ షెడ్లు నిరుపయోగంగా ఉంటున్నాయి. 


దేవరుప్పుల, డిసెంబరు 15: పల్లె ప్రగతిలో భాగంగా ప్రభుత్వం పలు అభివృద్ధి పనులు చేపడుతున్నది. గ్రామాల్లో చెత్త, వ్యర్థ పదార్థాల నిర్వహణ కీలకమైంది. దీని ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం చెత్తను సేకరించి ఒక నిర్ధేశిత చోటుకు తరలించేందుకు ప్రణాళికా బద్ధంగా అడుగులు వేసింది. ఇందులో భాగంగా పంచాయతీలకు ట్రాక్టర్లను అందజేసింది. చెత్తను క్రమపద్ధతిలో సేకరించాలని ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి ఇంటికి రెండు చెత్తబుట్టలు పంపిణీ చేసింది. ఒక బుట్టలో తడి, మరో బుట్టలో పొడి చెత్తను వేరుగా ఉంచాలని అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. చెత్తను డంపింగ్‌ యార్డులకు తరలించి కంపోస్టు ఎరువులు తయారు చేయాలని సూచించారు. కానీ ఫలితం శూన్యం. ఇప్పటికీ ఊరు పొలిమెరలోనే చెత్తను పాడేస్తున్నారు. ఇప్పటి వరకు ఒకటి, రెండు గ్రామాలు తప్ప తడి పొడి చెత్తను విడదీసిన దాఖలాలు లేవు. 


నిరుపయోగంగా చెత్త ఏరివేత షెడ్లు


మండల వ్యాప్తంగా 32 మండలాలకు గాను పడమటితండ-(డి), రాంచెంద్రాపురం మినహా 30 గ్రామపంచాయతీల్లో గ్రామ పంచాయతీకి ఒకటి చొప్పున డంపింగ్‌ యార్డులకు ఆనుకొని (సెగ్రిగేషన్‌ షెడ్స్‌)చెత్త ఏరివేత షెడ్లను నిర్మించారు. ఒక్కో షెడ్డుకు టాయిలెట్స్‌తో కలిపి రూ. 2.50లక్షలు ప్రభుత్వం కేటాయించింది. కానీ డంపింగ్‌ యార్డుకు తరలించిన చెత్తకు నిప్పు పెడుతున్నారు. దీంతో పొగ, దుర్గంధం, వాయు కాలుష్యం పెరుగుతున్నది. గ్రామ పొలిమేరల్లో డంపింగ్‌ యార్డుల పక్కనే నిర్మించిన ఈ షెడ్లలో చెత్తను వేరు చేసేందుకు ఆరు కంపార్టుమెంట్లతో పాటు కంపోస్టు  గదులను నిర్మించారు. వివిధ రకాలుగా వచ్చే చెత్తను ఆరు కంపార్టుమెంట్లలో  వేరు చేయాల్సి ఉంటుంది. తడి చెత్త, కూరగాయలు, ఆహార వ్యర్ధాలు, గడ్డి పేపర్లు కంపోస్టు గదుల్లో వేసి వాటిని ఎరువుగా మార్చాలి. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, పారిశుద్ధ్య కార్మికులకు అవగాహన కల్పించినప్పటికీ నేటికీ పాత పద్ధతిలోనే చెత్తను గ్రామ పొలిమేరల్లో వేసి నిప్పు పెడుతున్నారు. దీంతో లక్షలు వెచ్చించి నిర్మించిన షెడ్లు నిరుపయోగంగా ఉంటున్నాయి.

అయోమయంలో అధికారులు

చెత్త సేకరణకు బుట్టలు, తరలించేందుకు ట్రాక్టర్లు, డంపింగ్‌ చేయటానికి యార్డులు, చెత్తను వేరు చేయటానికి షెడ్లు నిర్మించినప్పటికీ అసలు ఈ చెత్తను వేరు చేసేదెవరు అనే విషయమై పంచాయతీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పంచాయతీకి ఒక మల్టీపర్పస్‌ వర్కర్‌ను నియమిస్తే ఆయనను ట్రాక్టర్‌ డ్రైవర్‌గా, చెత్త సేకరించే పనులతో పాటు ఇతర పనులకు వినియోగించుకుంటున్నారు. అయితే చెత్త ఏరివేసే పనులు ఎవరు నిర్వహించాలనే దానిపై ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ పని ఎవరికి అప్పగించాలో తెలియడం లేదని కార్యదర్శులు సర్పంచులు పేర్కొంటున్నారు. Read more