ఫలించిన నిరీక్షణ.. వరించిన పదవి..
ABN , First Publish Date - 2020-12-29T12:00:23+05:30 IST
కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ పాలక మండలి ఎన్నికలు 2014 జనవరిలో జరిగాయి. 2వ వార్డు సభ్యుడు సాద కేశవరెడ్డిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితర పార్టీ
సికింద్రాబాద్ : కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ పాలక మండలి ఎన్నికలు 2014 జనవరిలో జరిగాయి. 2వ వార్డు సభ్యుడు సాద కేశవరెడ్డిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితర పార్టీ పెద్దల ఆదేశాల మేరకు సభ్యులు ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 20 నెలల తర్వాత సహచర సభ్యుల మధ్య అంతర్గత కలహాలు తలెత్తాయి. ఉపాధ్యక్ష పదవి కోసం పోరు ప్రారంభమైంది. కేశవరెడ్డిని పదవి నుంచి తప్పుకోమని చెప్పారు. అందుకు ఆయన అంగీకరించకపోవడంతో సహచర సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి, పదవీచ్యుతుడ్ని చేశారు. మరోసారి మంత్రులు తలసాని, టి.పద్మారావుగౌడ్ తదితర నేతల జోక్యంతో 5వ వార్డు సభ్యునిగా ఉన్న జె.రామకృష్ణను ఏడాది కోసం ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత 6వ వార్డు సభ్యుడు కె.పాండుయాదవ్, 8వ వార్డు సభ్యుడు లోకనాథం, 3వ వార్డు సభ్యురాలు బి.అనిత పదవీ కాలాన్ని పంచుకోవాలని నిర్ణయించారు.
ఏడాది తర్వాత రామకృష్ణ పదవి నుంచి తప్పుకోలేదు. అప్పటి నుంచీ రామకృష్ణను పదవి నుంచి దించాలని సహచర సభ్యులు తీవ్రంగా యత్నించారు. వారిలో ఓ వర్గం రామకృష్ణకు అండగా నిలిచింది. ఫలితంగా మూడున్నర సంవత్సరాలకుపైగా రామకృష్ణ ఉపాధ్యక్ష సీటును కాపాడుకుంటూ వచ్చారు. గడిచిన పది నెలలుగా రామకృష్ణను సీటు నుంచి దింపే యత్నాలకు ప్రత్యర్థి వర్గం పదును పెట్టింది. చివరకు రెండు నెలల క్రితం వారి ప్రయత్నాలు ఫలించాయి. రామకృష్ణ స్థానంలో 1వ వార్డు సభ్యుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డిని ఉపాధ్యక్షునిగా ఎన్నుకోవాలంటూ స్థానిక కంటోన్మెంట్ శాసనసభ్యుడు జి.సాయన్న పార్టీ పెద్దలకు సిఫారసు లేఖ రాశారు. ఆ లేఖను పట్టుకుని ప్రత్యర్థి వర్గ సభ్యులు మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. దాంతో అధిష్ఠానం స్పందించింది. ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ రామకృష్ణను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. బోర్డు సభ్యులు సైతం ఒక్క తాటిపైకి వచ్చారు. రామకృష్ణను పదవి నుంచి తప్పుకోమని చెప్పారు.
గుడ్ బై : రామకృష్ణ
రామకృష్ణ వాటిని బేఖాతరు చేశారు. టీఆర్‌ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. తాను పార్టీలో లేనందున రాజీనామా చేసే ప్రసక్తి లేదని భీష్మించుకు కూర్చున్నారు. దాంతో కంగుతిన్న సహచర బోర్డు సభ్యులు రెండు నెలల క్రితం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. రామకృష్ణను పదవి నుంచి తొలగించారు. న్యాయస్థానం స్టేటస్ కో ఇచ్చింది. దాంతో తానే ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నానంటూ రామకృష్ణ ప్రకటించుకున్నారు. కొద్ది రోజుల తర్వాత న్యాయస్థానం నుంచి కూడా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఆ ఉత్తర్వులు అమలులోకి వచ్చి, మళ్లీ ఉపాధ్యక్ష సీటులో రామకృష్ణ కూర్చోకముందే మరోసారి సభ్యులు ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈసారి హడావిడి పడకుండా, జాగ్రత్తలు తీసుకుని, నిబంధనలు పాటించి, పదవీచ్యుతుడ్ని చేశారు. వారం రోజుల తర్వాత నూతన ఉపాధ్యక్షుని ఎన్నిక చేపట్టి, తాజాగా సోమవారం జక్కుల మహేశ్వర్‌రెడ్డిని బోర్డు ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్నారు.
ఆడ పడుచుల కట్నం ఇవ్వాలి...
ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జక్కుల మహేశ్వర్‌రెడ్డి బోర్డు కార్యాలయంలోని సభ్యుల రూమ్‌కు వస్తుండగా 3, 4, 7వ వార్డులకు చెందిన మహిళా సభ్యులు బి.అనిత, పి.నళినికిరణ్, ప్యారసాని భాగ్యశ్రీ అడ్డుకున్నారు. ఆడ పడుచుల కట్నం సమర్పిస్తేగాని లోనికి కాలు పెట్టనిచ్చేది లేదని సరదాగా పట్టు పట్టారు. తర్వాత చూద్దామంటూ మహేశ్వర్‌రెడ్డి చెప్పినా వారు పట్టు వీడలేదు. ఆయన వారికి తగిన హామీ ఇవ్వడంతో లోనికి రానిచ్చారు. ఈ వ్యవహారం అక్కడున్న వారందరినీ నవ్వించింది.