రేపటి నుంచే స్కూళ్లు, కాలేజీలు

ABN , First Publish Date - 2020-09-20T11:49:10+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే, విద్యార్థులకు తరగతులు మాత్రం ఉండవు. పాఠ్యాంశాల్లో ఏమైనా

రేపటి నుంచే స్కూళ్లు, కాలేజీలు

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే, విద్యార్థులకు తరగతులు మాత్రం ఉండవు. పాఠ్యాంశాల్లో ఏమైనా సందేహాలుంటే టీచర్లు నివృత్తి చేస్తారు. ఈ మేరకు అన్ని స్కూళ్లలో సగం మంది టీచర్లు విధులకు హాజరు కానున్నారు.


కేంద్రం వెలువరించిన అన్‌లాక్‌-4 మార్గదర్శకాల ప్రకారం విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఆన్‌లైన్‌ తరగతు లు కొనసాగుతున్నందున ఉపాధ్యాయులు నిర్వర్తించాల్సిన బాధ్యతలు, ఇతర అంశాలపై వివిధ జిల్లాల విద్యాశాఖ అధికారులు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. శనివారం వివిధ జిల్లాల్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ల్లో టీచర్ల సందేహాలను డీఈవోలు నివృత్తి చేశారు. ఉపాధ్యాయులు రోజు విడిచి రోజు విధులకు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కొన్ని చోట్ల వారంలో మూడు రోజుల చొప్పున హాజరయ్యేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమై 20 రోజులు అవుతున్నందున పాఠాల వారీగా వర్క్‌షీట్ల పంపిణీ, వాటి ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించే ప్రక్రియ చేపట్టాలని టీచర్లను ఆదేశించారు.


అన్‌లాక్‌-4 సడలింపుల్లో భాగంగా ఈ నెల 21 నుంచి ఉపాధ్యాయుల సలహాలు పొందేందుకు, అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు తల్లిదండ్రుల అనుమతితో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లవచ్చని కేంద్రం తెలిపింది. 9, 10వ తరగతుల విద్యార్థులకు పాఠ్యాంశాల్లో ఏమైనా అనుమానాలుంటే టీచర్లు నివృత్తి చేస్తారు. ఇంటర్మీడియట్‌ కాలేజీల్లోనూ ఇదే విధానం పాటించనున్నారు.

Updated Date - 2020-09-20T11:49:10+05:30 IST