డిప్యూటీ కలెక్టర్‌గా సంతోషి

ABN , First Publish Date - 2020-06-21T08:52:39+05:30 IST

గాల్వన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్‌ సంతో్‌షబాబు భార్య సంతోషికి డిప్యూటీ కలెక్టర్‌

డిప్యూటీ కలెక్టర్‌గా సంతోషి

  • నియామక ఉత్తర్వులను స్వయంగా అందజేయనున్న సీఎం కేసీఆర్‌
  • రూ.5కోట్ల ఆర్థిక సాయంతోపాటు
  • షేక్‌పేటలో 500 గజాల స్థలం 
  • రేపు సంతోష్‌ కుటుంబానికి పరామర్శ

దామరచర్ల/సూర్యాపేట/హైదరాబాద్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): గాల్వన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్‌ సంతో్‌షబాబు భార్య సంతోషికి డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు నియామక ఉత్తర్వులను సిద్ధం చేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. ముఖ్యమంత్రి విచక్షణాధికారాలతో ఎవరినైనా గ్రూప్‌-1 స్థాయి దాకా ఉన్న పోస్టుల్లో నియమించే అవకాశం ఉంది. ఆ అధికారంతోనే సంతోషిని డిప్యూటీ కలెక్టర్‌గా నియమించనున్నారు. సంతో్‌షబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం కేసీఆర్‌ సోమవారం సూర్యాపేట వెళ్లనున్నారు. ఈ సందర్భంగానే సంతోషికి నియామక ఉత్తర్వులను స్వయంగా అందజేయనున్నారు. అలాగే, హైదరాబాద్‌ జిల్లా షేక్‌పేటలో 500 గజాల స్థల కేటాయింపు జీవో కాపీతోపాటు రూ.5కోట్ల చెక్కును అందించనున్నారు.


కృష్ణా-మూసీ సంగమంలో అస్థికల నిమజ్జనం

కల్నల్‌ సంతో‌ష్‌బాబు అస్థికలను దామరచర్ల మండలంలోని వాడపల్లి కృష్ణా-మూసీ నదుల సంగమం వద్ద శనివారం నిమజ్జనం చేశారు. పూజల అనంతరం కుటుంబ సభ్యులు మర పడవలో వెళ్లి అస్థికలను సంగమంలో కలిపారు. అస్థికలను నిమజ్జనం చేసే ముందు సంతో‌ష్‌బాబు కుమారుడు అనిరుధ్‌తేజ తాత ఉపేందర్‌ వైపు అమాయకంగా చూడటంతో కల్నల్‌ భార్య సంతోషి, కుటుంబసభ్యులు బోరున విలపించారు. ఈ సందర్భంగా అమరుడి త్యాగాన్ని స్మరించుకుంటూ పలువురు కంటతడి పెట్టారు. కాగా, సంతో‌ష్‌బాబు అస్థికల నిమజ్జనానికి కుటుంబసభ్యులు వస్తున్నారని తెలిసి మండల ప్రజలు పలు చోట్ల వారి వాహనాలపై పూల వర్షం కురిపించారు. జాతీయ జెండాలు చేతబూని సంతో‌ష్‌బాబు ఆత్మకు శాంతి చేకూరాలంటూ నినాదాలు చేశారు.


సంతోష్‌ సేవలు స్ఫూర్తిదాయకం

సంతో‌ష్‌బాబు సేవలు యువతకు స్ఫూర్తిగా ఉండాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. తన సతీమణి సునీతతో కలిసి సంతో‌ష్‌బాబు కుటుంబ సభ్యులను శనివారం ఆయన పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం రాక విషయమై కల్నల్‌ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని, ప్రభుత్వ సాయాన్ని అందుకోవడానికి వారు అంగీకరించారని చెప్పారు. తమతో పాటు దేశంలోని ఇతర సైనికులకు సాయం చేయడానికి ముందుకొచ్చిన కేసీఆర్‌కు వారు ధన్యవాదాలు తెలిపారని చెప్పారు. కాగా, దేశం కోసం ప్రాణాలు విడిచిన సంతో‌ష్‌బాబు జ్ఞాపకార్థం సూర్యాపేటలో సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేయాలని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం డిమాండ్‌ చేశారు. సంతో‌ష్‌బాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. వీర సైనికుడి కుటుంబానికి ప్రభుత్వం ప్రకటిస్తున్న సాయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సంతో‌ష్‌బాబు ధైర్య సాహసాలు యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

Updated Date - 2020-06-21T08:52:39+05:30 IST