సంజయ్ అరెస్టు అప్రజాస్వామికం
ABN , First Publish Date - 2020-10-28T10:21:32+05:30 IST
దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు తరఫున ప్రచారం చేసేందుకు వెళ్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ని పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమెందర్‌రెడ్డి
సంజయ్ అరెస్టును నిరసిస్తు హన్మకొండలో బీజేపీ ధర్నా
వరంగల్ అర్బన్ స్పోర్ట్స్, ఆక్టోబరు 27:
దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు తరఫున ప్రచారం చేసేందుకు వెళ్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ని పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి అన్నారు. బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ మంగళవారం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ చౌరస్త్తాలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ దుబ్బాకలో బీజేపీ ఆభ్యర్థి రఘునందన్‌రావు గెలుపు తథ్యమని భావించిన సీఎం కేసీఆర్.. పోలీసులతో బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. దుబ్బాకలో టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కేసీఆర్ పోలీసులను, అధికార యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.
సిద్దిపేట పోలీస్‌కమిషనర్ ప్రభుత్వ తొత్తుగా వ్యవహరిస్తూ బీజేపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఆయనను వెంటనే విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. దుబ్బాకలో ఎన్నికలు పారదర్శకంగా జరిపించేందుకు కేంద్ర బలగాలను రప్పించాలని, దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర గవర్నర్‌కు వినతిపత్రాలు అందిస్తామన్నారు. కరోనా నేపథ్యంలో మోదీ ప్రభుత్వం రూ.20లక్షల కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించిందని గుర్తుచేశారు. కాగా రాస్తారోకో సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు తోపులాట, వాగ్వాదం జరిగింది. అనంతరం బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.