ఇసుక సిరులు

ABN , First Publish Date - 2020-05-17T09:01:22+05:30 IST

ఇసుక రీచ్‌లు సర్కారుకు సిరులు కురిపిస్తున్నాయి. మొన్నటి వరకూ లాక్‌డౌన్‌తో నిలిచిన ఇసుక తవ్వకాలు ఇటీవల పునః ప్రారంభమయ్యాయి. వేసవి కావడం, ప్రభుత్వం...

ఇసుక సిరులు

8 జిల్లాల్లో 23 రీచ్‌లు పునః ప్రారంభం

రోజుకు రూ.2 కోట్లకుపైగా ఆదాయం

75%పైగా భూపాలపల్లి నుంచే రవాణా

మరో 20 చోట్ల తవ్వకాలకు అనుమతి

హైదరాబాద్‌లో దిగివచ్చిన ఇసుక ధర

టన్ను ధర రూ.1900-2100


భూపాలపల్లి, మే 16 (ఆంధ్రజ్యోతి): ఇసుక రీచ్‌లు సర్కారుకు సిరులు కురిపిస్తున్నాయి. మొన్నటి వరకూ లాక్‌డౌన్‌తో నిలిచిన ఇసుక తవ్వకాలు ఇటీవల పునః ప్రారంభమయ్యాయి. వేసవి కావడం, ప్రభుత్వం నిర్మాణ రంగానికి లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో ఇసుకకు డిమాండ్‌ పెరిగింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇసుక రీచ్‌లుండగా, 8 జిల్లాల నుంచి భారీగా ఇసుక అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో ఆదాయం సమకూరుతోంది. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుతో హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో నిర్మాణ పనులు జోరందుకున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఇసుకకు తీవ్ర కొరత ఏర్పడటంతో ప్రభుత్వం గోదావరి తీర ప్రాంతంతో పాటు ఇసుక లభ్యత ఉన్న అన్ని జిల్లాల్లో తవ్వకాలకు అనుమతులిచ్చింది. తెలంగాణ స్టేట్‌ మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(టీఎ్‌సఎండీసీ) ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో అమ్మకాలు జరుగుతున్నాయి. తెలంగాణలో 13 జిల్లాల్లో ఇసుక ఉంది. ప్రస్తుతం భూపాలపల్లిలో 13 రీచ్‌లు, మంచిర్యాలలో 3, గద్వాలలో 2, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్‌, మెదక్‌, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో రీచ్‌ నుంచి తవ్వకాలు చేపట్టారు. మొత్తం 23 రీచ్‌ల నుంచి ఆన్‌లైన్‌లో విక్రయాలు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మేడ్చల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లోనూ తవ్వకాలు చేపట్టారు.  రాష్ట్రంలో లభించే ఇసుకలో భూపాలపల్లి జిల్లా నుంచే 75 శాతానికి పైగా ఉంది. జిల్లాలో 23 ఇసుక రీచ్‌లుండగా, ప్రస్తుతం 13 రీచ్‌లను పునఃప్రారంభించారు. 


దండిగా ఆదాయం

ఇసుక అమ్మకాలతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతోంది. శనివారం 23 రీచ్‌లలో 32,600 క్యూబిక్‌ మీటర్ల ఇసుకను విక్రయించారు. ఒక క్యూబిక్‌ మీటరు ఇసుక రూ.600 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ లెక్కన 32,600 క్యూబిక్‌ మీటర్ల ఇసుకకు రూ.కోటి 95లక్షల 60వేల ఆదాయం వచ్చింది. దీనికి తోడు ప్రతి లారీకి జీఎస్టీ కింద రాష్ట్ర ప్రభుత్వానికి రూ.200, కేంద్రానికి రూ.200 చొప్పున చెల్లిస్తున్నారు. మొత్తంగా చూస్తే శనివారం ఒక్కరోజే రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2కోట్లకు పైగా ఆదాయం లభించింది. ఒక్క భూపాలపల్లి జిల్లా నుంచే 25,500 క్యూబిక్‌ మీటర్ల ఇసుక ద్వారా రూ.1.53కోట్ల ఆదాయం వచ్చింది. అంటే జిల్లా నుంచి 75శాతానికి పైగా ఆదాయం వస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 23 రీచ్‌లలో ఇసుక తవ్వకాలు జరుగుతుండగా, మరో 20 రీచ్‌ల వరకు ప్రభుత్వం నుంచి అనుమతులు లభించినట్లు టీఎ్‌సఎండీసీ అధికారులు పేర్కొంటున్నారు. 


నగరానికి రోజూ 1,500 లారీలు 

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): లాక్‌డౌన్‌ వల్ల హైదరాబాద్‌లో ఇసుక కొరత ఏర్పడి టన్నుకు రూ.4 వేల వరకు ధర పలికింది. అయితే ప్రభుత్వం లాక్‌డౌన్‌లో సడలింపు ఇవ్వడంతో నగరానికి ఇసుక రవాణా పెరిగింది. ప్రస్తుతం నాణ్యమైన ఇసుక టన్నుకు రూ.1,900 నుంచి 2,100 వరకు అమ్ముతున్నారు. పెద్దసైజు ఇసుక రూ.1,600 నుంచి రూ. 1,800కే దొరుకుతోంది. గతంలో నగరానికి రోజూ 4 వేల లారీల ఇసుక వచ్చేది. లాక్‌డౌన్‌తో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం రోజూ 1,500 లారీలు వస్తున్నాయి. 

Updated Date - 2020-05-17T09:01:22+05:30 IST