పోలీస్‌.. శభాష్‌

ABN , First Publish Date - 2020-04-05T11:17:15+05:30 IST

అది మారేడుపల్లి కీర్తి సుదర్శన్‌ అపార్ట్‌మెంట్‌, సమయం ఉదయం 5.25 గంటలు. రేఖ అనే గర్భిణికి మార్చి 31న ఉదయం పురిటి నొప్పులు...

పోలీస్‌.. శభాష్‌

  • నగరంలో గర్భిణికి పురిటి నొప్పులు
  • 108కి ఫోన్‌ చేసిన కుటుంబ సభ్యులు
  • స్పందించని సిబ్బంది.. డయల్‌ 100కు కాల్‌ 
  • గర్భిణిని ఆస్పత్రిలో చేర్చిన మారేడుపల్లి పోలీసులు 
  • సిబ్బందిని అభినందించిన సీపీ అంజనీ కుమార్‌ 

మారేడుపల్లి/హైదరాబాద్‌ ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి) : అది మారేడుపల్లి కీర్తి సుదర్శన్‌ అపార్ట్‌మెంట్‌, సమయం ఉదయం 5.25 గంటలు. రేఖ అనే గర్భిణికి మార్చి 31న ఉదయం పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించాలనుకున్నారు. లాక్‌డౌన్‌ కొనసాగుతుండడంతో 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. అంబులెన్స్‌ నుంచి సమాధా నం రాలేదు. ఏం చేయాలో దిక్కుతోచలేదు. వెంటనే పోలీసులు గుర్తుకొచ్చారు.100కు డయల్‌ చేశారు. కాల్‌ అందుకున్న మారేడుపల్లి పెట్రోలింగ్‌ వాహనం (కార్‌ నంబర్‌ 1) సిబ్బంది కొద్ది క్షణాల్లోనే వారి వద్దకు చేరుకున్నారు. ప్రసవ వేదనతో బాధపడుతున్న రేఖను జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సాధారణ ప్రసవం చేశారు. రేఖ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు ప్రకటించారు. దాంతో రేఖ కుటుంబ సభ్యులు మారేడుపల్లి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని మారేడుపల్లి పోలీసులు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేశారు. దీనికి హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ స్పందించారు. మారేడుపల్లి పోలీసులను అభినందించారు. పోలీసు అధికారిగా ఉన్నందుకు గర్వపడుతున్నానని ట్వీట్‌ చేశారు. గర్భిణి ని ఆస్పత్రికి తరలించడంలో చొరవ చూపిన కానిస్టేబుల్‌ పి.మెహన్‌రావుకు సీపీ రూ.5 వేల రివార్డు, ప్రశంసాపత్రం అందించారు. 


లాక్‌డౌన్‌ వేళ..  

లాక్‌డౌన్‌ సమయంలో గర్భిణులు, బాలింతలు, ఇతర రోగులకు సైబరాబాద్‌ పోలీసులు అండగా ఉంటున్నారు. వారిని పోలీస్‌ అంబులెన్స్‌లో ఆస్పత్రులకు తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తున్నారు. అనంతరం మళ్లీ ఇళ్ల వద్ద దించుతున్నారు. ఇంతకుముందు జీడిమెట్లకు చెందిన రేణుక అనే గర్భిణిని అత్యవసరంగా ఆస్పత్రికి తీసుకువెళ్లవలసి వచ్చింది. ఆమె భర్త శేఖర్‌ సైబరాబాద్‌ కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేశాడు. వెంటనే  బాలానగర్‌ డివిజన్‌లో అందుబాటులో ఉంచిన పోలీస్‌ అంబులెన్స్‌ను పంపారు. అందులో రేణుకను ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు ముగిసిన తరువాత క్షేమంగా తిరిగి ఇంటి వద్ద దింపారు. అలాగే జగద్గిరిగుట్టకు చెందిన హేమలత అనే గర్భిణిని కూడా అంబులెన్స్‌లో తీసుకువెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. వీరే కాకుండా అత్యవసర వైద్యసేవలు అవసరమైన వారికి పోలీసులు అండగా నిలుస్తున్నారు. ఇటీవల అందుబాటులోకి తెచ్చిన 13 అంబులెన్స్‌లను పోలీసులు విస్తృతంగా వినియోగిస్తున్నారు.

Updated Date - 2020-04-05T11:17:15+05:30 IST