కార్వీ షేర్‌ సబ్‌-బ్రోకరేజీలో బడా మోసం

ABN , First Publish Date - 2020-10-13T10:10:51+05:30 IST

కార్వీ షేర్‌ సబ్‌-బ్రోకరేజీలో బడా మోసం జరిగింది. డీమ్యాట్‌ ఖాతాదారుల ప్రమేయం లేకుండానే.. తార్నాక బ్రాంచి

కార్వీ షేర్‌ సబ్‌-బ్రోకరేజీలో బడా మోసం

చెప్పకుండానే షేర్ల విక్రయాలు

ఎన్నారై దంపతులకు  కోటి నష్టం

కమీషన్‌ కక్కుర్తి.. ఇద్దరి అరెస్టు


హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 12 (ఆంధ్రజ్యోతి): కార్వీ షేర్‌ సబ్‌-బ్రోకరేజీలో బడా మోసం జరిగింది. డీమ్యాట్‌ ఖాతాదారుల ప్రమేయం లేకుండానే.. తార్నాక బ్రాంచి కార్వీ సబ్‌-బ్రోకరేజ్‌ కార్యాలయ మేనేజరు, అసిస్టెంట్‌ మేనేజరు కలిసి.. కమీషన్‌ కక్కుర్తితో ఇష్టారాజ్యంగా షేర్ల క్రయవిక్రయాలు జరిపారు. బాధిత ఎన్నారై దంపతులకు రూ. కోటి నష్టం కలిగించారు. నిందితులిద్దరినీ హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయ దంపతులు రామారావు నాగరాజు, ఆయన భార్య 2018లో కార్వీ షేర్‌ బ్రోకరేజీ తార్నాక బ్రాంచిలో ఖాతాలు తెరిచారు. ఇద్దరూ కలిసి రూ.కోటి విలువైన షేర్లను కొనుగోలు చేశారు. డీమ్యాట్‌ ఖాతా యాక్టివేషన్‌ సమయంలో.. కార్వీ బ్రాంచ్‌ మేనేజర్‌ జి.మౌనిక, అసిస్టెంట్‌ మేనేజర్‌ శివినిగారిశెట్టి వసుంధర ఆ దంపతుల నుంచి ఖాళీ పేపర్లపై సంతకాలు తీసుకున్నారు.


ఈ ఏడాది సెప్టెంబరులో భారత్‌కు తిరిగి వచ్చిన నాగరాజు దంపతులు.. తమ డీమ్యాట్‌ ఖాతాలను పరిశీలించి, నిశ్చేష్టులయ్యారు. 2018 మే నుంచి 2019 ఫిబ్రవరి వరకు తమ ప్రమేయం లేకుండా.. ఖాతాలోని డబ్బులతో షేర్ల క్రయవిక్రయాలు జరిగినట్లు.. ఈ లావాదేవీల విలువ రూ.100 కోట్లుగా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. కమీషన్‌ కక్కుర్తితో మౌనిక, వసుంధర కలిసి.. షేర్ల క్రయవిక్రయాలు జరిపినట్లు గుర్తించారు. ఉద్దేశపూర్వకంగా వారు మోసానికి పాల్పడి.. 60ు కమీషన్‌ తీసుకున్నారని, మిగతా 40ు కమీషన్‌ను మెయిన్‌ బ్రాంచికి అందజేశారని నిర్ధారించారు. సెబీ, ఎన్‌ఎ్‌సఈ నిబంధనలను వారు ఉల్లంఘించినట్లు తేల్చారు. దీంతో సోమవారం నిందితులిద్దరినీ అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2020-10-13T10:10:51+05:30 IST