సాగర్‌లో ఎన్‌ఎస్పీ క్వార్టర్ల విక్రయం

ABN , First Publish Date - 2020-09-13T08:39:39+05:30 IST

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ (నందికొండ) పట్టణ పరిధిలోని 1,091 ఎన్‌ఎస్పీ (నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు) క్వార్టర్లను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సాగర్‌లో ఎన్‌ఎస్పీ క్వార్టర్ల విక్రయం

 సర్కారు నిర్ణయం.. 

కలెక్టర్‌కు బాధ్యత అప్పగింత


నల్లగొండ, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ (నందికొండ) పట్టణ పరిధిలోని 1,091 ఎన్‌ఎస్పీ (నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు) క్వార్టర్లను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు టెండర్లు నిర్వహించి విక్రయించే బాధ్యతలను కలెక్టర్‌కు అప్పగిస్తూ నీటి పారుదల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.


65 ఏళ్ల క్రితం సాగర్‌ డ్యాం నిర్మాణం, నిర్వహణ కోసం 1,351 క్వార్టర్లు నిర్మించారు. కాలక్రమంలో ఉద్యోగులు, అధికారుల అవసరాలు స్థానికంగా తగ్గడంతో సిబ్బందిని బదిలీ చేస్తూపోగా క్వార్టర్లు ప్రైవేటు వ్యక్తులు, విశ్రాంత ఉద్యోగుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. కొందరు నేతలు రాజకీయ పలుకుబడితో వారి పేరిట కేటాయించుకున్నారు.


ఈ తరుణంలో క్యార్టర్లను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుదీర్ఘకాలంగా ఇక్కడ ఉంటున్న తమకు దక్కుతాయని స్థానికులు ఆశించగా, ప్రభుత్వ తాజా నిర్ణయంతో వారంతా నిరాశలో మునిగిపోయారు.


గతంలోనే వ్యతిరేకించిన ప్రజలు

ఏ, బీ కేటగిరీల్లోని క్వార్టర్లను విక్రయించాలనే ప్రయత్నాలు గత ప్రభ్వుత్వంలోనూ చాలా జరిగాయి. హిల్‌కాలనీలో ఉన్న క్వార్టర్లకు సంబంధించి భూమికి గజం రూ.750, పైలాన్‌ కాలనీలోని భూమికి గజం రూ.500గా నిర్ధారించారు. స్థానిక ప్రజలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.  దీంతో ఆ ప్రక్రియ అప్పట్లో నిలిచింది.


టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక గజం రూ.3 వేల చొప్పున నిర్ధారించింది.  ఏ - కేటగిరీలోని ఒక్కో క్వార్టర్‌ ధర రూ.1.70లక్షలు, బీ - కేటగిరీలోని ఒక్కో క్వార్టర్‌ ధర రూ.1.60లక్షల చొప్పున నిర్ణయించారు. అయితే, ఈ ధరకు కొనుగోలు చేసేందుకు స్థానికులు ఎవరూ ఆసక్తి చూపించలేదు. 


Updated Date - 2020-09-13T08:39:39+05:30 IST