జీతాల కోత ఆర్డినెన్స్‌పై భగ్గు

ABN , First Publish Date - 2020-06-18T09:26:12+05:30 IST

వేతనాల్లో కొంత పక్కనపెడుతూ (డిఫర్‌మెంట్‌) ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌పై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు భగ్గుమన్నాయి.

జీతాల కోత ఆర్డినెన్స్‌పై భగ్గు

  • ఉద్యోగులను వంచించడమే: వీఆర్‌ఓల సంక్షేమ సంఘం
  • చట్టవిరుద్ధ ఆర్డినెన్స్‌: సీఐటీయూ

హైదరాబాద్‌/కవాడిగూడ, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): వేతనాల్లో కొంత పక్కనపెడుతూ (డిఫర్‌మెంట్‌) ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌పై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు భగ్గుమన్నాయి. తక్షణమే దాన్ని వెనక్కి తీసుకోవాలని గట్టిగా అడిగాయి. ఉద్యోగులను వంచించేందుకే ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ జారీ చేసిందని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గరికె ఉపేంద్రరావు, హరాలే సుధాకర్‌రావు విమర్శించారు.  జూన్‌ వేతనాన్ని పూర్తిస్థాయిలో చెల్లించకుంటే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ ఆర్డినెన్స్‌ను తేవడం చట్టవిరుద్ధమని సీఐటీయూ రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఇందుకు నిరసనగా గురువారం అన్ని మండల, పట్టణ కేంద్రలలో ఆర్డినెన్స్‌ కాపీలను తగులబెడతామని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు తెలిపారు.


వేతనాల కోత ఆర్డినెన్స్‌పై కేంద్రం జోక్యం చేసుకొని ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించాలని అనుబంధ కాలేజీల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ సూరారపు భిక్షం డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన తన చర్యను సమర్థించుకోవటానికి రాత్రికి రాత్రే ఆర్డినెన్సును తెచ్చిందని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ప్రభుత్వ రంగ, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక, టీఎస్‌ యూటీఎఫ్‌ ఆరోపించాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ దుర్మార్గమైందని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. 


ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీకి విద్యుత్తు జేఏసీ వినతి

ఇరవై గంటల పాటు నిరాఘాటంగా విద్యుత్తును అందిస్తున్న విద్యుత్తు ఉద్యోగులకు పూర్తి వేతనాలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ కోరింది. ఈ మేరకు గురువారం ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావును 22 సంఘాలతో కూడిన జేఏసీ తరపు ప్రతినిధులు పద్మారెడ్డి, రత్నాకర్‌రావు తదితరులు కలిసి, వినతిపత్రాన్ని అందించారు. యాభై శాతం వేతనాలతో ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారని, ఇంటి అద్దెలు, వైద్యం, పిల్లల చదువు, గృహ రుణాలు కట్టే పరిస్థితి లేకుండా పోయిందని తెలిపారు. వెంటనే విద్యుత్తుఉద్యోగులు, కార్మికులందరికీ పూర్తి వేతనాలు ఇవ్వాలని కోరారు.  


ఆర్డినెన్స్‌పై ఆందోళన వద్దు: టీఎన్జీవోల సంఘం

వేతనాల కోతపై ఉద్యోగులెవరూ ఆందోళనకు గురికావొద్దని, జూన్‌ నెల వేతనాలను చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను కలిసి విజ్ఙప్తి చేస్తామని టీఎన్జీవోల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.రవీందర్‌రెడ్డి, ఎం.రాజేందర్‌ పేర్కొన్నారు. వేతనాల విషయంలో దేశంలో పలు రాష్ట్రాలు ఆర్డినెన్స్‌లు తెచ్చాయని, ఇందులో ఆందోళనకు గురికావాల్సిన అవసర మే లేదన్నారు. హైకోర్టులో పెన్షన్ల కేసు విచారణలోభాగంగానే ఆర్డినెన్స్‌ తెచ్చామని తాము భావిస్తున్నామని, అంతే తప్ప ఇతరత్రా అంశాలేవీ ఉండకపోవచ్చన్నారు. 

Updated Date - 2020-06-18T09:26:12+05:30 IST