ఆర్టీసీ నష్టాలను తగ్గిస్తున్నాం: పువ్వాడ అజయ్‌

ABN , First Publish Date - 2020-03-15T09:53:32+05:30 IST

గతంతో పోలిస్తే ఆర్టీసీ నష్టాలను క్రమంగా తగ్గిస్తున్నామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు.

ఆర్టీసీ నష్టాలను తగ్గిస్తున్నాం: పువ్వాడ అజయ్‌

హైదరాబాద్‌, మార్చి 14(ఆంధ్రజ్యోతి): గతంతో పోలిస్తే ఆర్టీసీ నష్టాలను క్రమంగా తగ్గిస్తున్నామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. ఆర్టీసీకి 2017-18లో రూ.748.90 కోట్లు, 2018-19లో 928.67 కోట్ల నష్టం వచ్చిందన్నారు. ఈ నెలాఖరు వరకు లెక్కలు తీస్తే నష్టం రూ.200 కోట్లకు తగ్గే అంచనాలు ఉన్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలు రెచ్చగొట్టడం వల్లే సమ్మె కాలంలో ఆర్టీసీ కార్మికుల మరణాలు జరిగాయని, ఆ కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకున్నదని పేర్కొన్నారు. ఆర్టీసీలో అద్దె బస్సుల వల్ల కిలో మీటరుకు 75పైసల లాభం వస్తున్నదని, సొంత బస్సుల వల్ల కిలోమీటరుకు రూ.12 నుంచి రూ.13 నష్టం వస్తోందని తెలిపారు. అందుకే 1,334 కొత్త అద్దె బస్సులను తీసుకున్నట్లు తెలిపారు. వీటిలో 920 బస్సులు గ్రామీణా ప్రాంతాలకే సేవలు అందిస్తాయని అన్నారు.  

Updated Date - 2020-03-15T09:53:32+05:30 IST