విధుల్లేవు.. వేతనాలు రావు
ABN , First Publish Date - 2020-07-19T08:48:23+05:30 IST
ఆర్టీసీలో మెడికల్ అన్‌ఫిట్ ఉద్యోగుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. అటు ఉన్న ఉద్యోగం ఊడిపోయి, ఇటు ఇతర విధుల్లో సర్దుబాటు కాకపోవడంతో నెలల తరబడి వేతనాలు...

ఆర్టీసీలో మెడికల్ అన్‌ఫిట్ ఉద్యోగుల ఇక్కట్లు
హైదరాబాద్, జూలై 18(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీలో మెడికల్ అన్‌ఫిట్ ఉద్యోగుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. అటు ఉన్న ఉద్యోగం ఊడిపోయి, ఇటు ఇతర విధుల్లో సర్దుబాటు కాకపోవడంతో నెలల తరబడి వేతనాలు అందక నానా పాట్లూ పడుతున్నారు. ఏదో ఒక విధుల్లో సర్దుబాటు చేయాలంటూ అధికారులను కలిసి కోరుతున్నా ఫలితం కనిపించడం లేదు. కంటి చూపు సన్నగిల్లడం, మెడ, వెన్ను నొప్పి వంటి రుగ్మతలున్న సిబ్బందిని మెడికల్ అన్‌ఫిట్‌గా వైద్యులు నిర్ధారిస్తారు. ఇలాంటి వారిలో డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బంది ఉంటే ఇతర పోస్టుల్లో సర్దుబాటు చేయాలి. కానీ, ఆర్టీసీ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. దీంతో దాదాపు 200కు పైగా సిబ్బంది విధుల కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు 15 నెలలుగా నిరీక్షిస్తున్నారు. వీరికి పోస్టింగ్ ఇవ్వకపోవడంతో వేతనాలు అందడం లేదు. ఇలాంటి వారి పోస్టింగ్‌ల విషయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(మెడికల్) సారథ్యంలోని బోర్డు ప్రతి నెలలో రెండు సార్లు సమావేశమై చర్చించాలి. పూర్తిగా అన్‌ఫిట్ అయిన వారికి ఐదేళ్లకు పైగా సర్వీసు మిగిలి ఉంటే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి, సదరు ఉద్యోగికి రిటైర్మెంట్‌ను ప్రకటించాలి. కానీ, 15 నెలలుగా మెడికల్ బోర్డు సమావేశం కావడం లేదు. కాగా, ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరుతూ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు టీజేఎంయూ ప్రధాన కార్యదర్శి హన్మంతు లేఖ రాశారు.