ఆర్టీసీ... డ్రైవింగ్ స్కూళ్ళు... త్వరలో

ABN , First Publish Date - 2020-07-14T21:41:50+05:30 IST

ఆర్టీసీకి ప్రత్యేకంగా త్వరలో ఓ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు కానుంది. ఇప్పటివరకు... ప్రైవేటు సంస్థలు మాత్రమే డ్రైవింగ్ స్కూళ్ళను ఏర్పాటు చేస్తుండగా... రాష్ట్రంలో ఇది కొత్త పరిణామం. అదీ సాదాసీదాగా కాదు... ఒక్కో బ్యాచ్‌లో వేల సంఖ్యలో అభ్యర్ధులకు శిక్షణ ఇచ్చేలా.

ఆర్టీసీ... డ్రైవింగ్ స్కూళ్ళు... త్వరలో

హైదరాబాద్ : ఆర్టీసీకి ప్రత్యేకంగా త్వరలో ఓ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు కానుంది. ఇప్పటివరకు... ప్రైవేటు సంస్థలు మాత్రమే డ్రైవింగ్ స్కూళ్ళను ఏర్పాటు చేస్తుండగా... రాష్ట్రంలో ఇది కొత్త పరిణామం. అదీ సాదాసీదాగా కాదు... ఒక్కో బ్యాచ్‌లో వేల సంఖ్యలో అభ్యర్ధులకు శిక్షణ ఇచ్చేలా. 


ప్రస్తుతానికి... హైదరాబాద్‌లో రెండు, వరంగల్‌లో ఒకటి చొప్పున ఈ స్కూళ్ళను ఏర్పాటు చేసేలా ఆర్టీసీ యత్నిస్తోంది. అభ్యర్ధులకు నాణ్యమైన ప్రమాణాలతో కూడి డ్రైవింగ్‌ను నేర్పించడంతోపాటు ఆర్ధిక సంక్షోభం నుంచి కొంతమేరకైనా బయటపడాలన్న ఉద్దేశంతో ఆర్టీసీ... ఈ డ్రైవింగ్ స్కూళ్ళను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.


గత రెండు నెలలుగా ప్రబలుతోన్న కరోనా నేపధ్యంలో... ఆర్టీసీ రూ. 700 కోట్ల మేరకు ఆదాయాన్ని కోల్పోయింది. ప్రస్తుతం నడుస్తోన్న బస్సులతో కేవలం రూ. 5 కోట్ల ఆదాయం మాత్రమే వస్తోంది. ఈ క్రమంలో... యాజమాన్యం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది. ఈ క్రమంలోనే... త్వరలో మూడు డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాలను ప్రారంభించనుంది. 


ఇందులో తేలికపాటి వాహనాలైన కార్లు మొదలు.. భారీ వాహనాలను నడిపేలా ప్రైవేటు వ్యక్తులకు శిక్షణనిచ్చేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఒక బ్యాచ్‌లో ఏకంగా 20 వేల మందికి శిక్షణ ఇచ్చే సామర్థ్యంతో హైదరాబాద్‌లో రెండు, వరంగల్‌లో ఒకటి చొప్పున కేంద్రాలను ఏర్పాటు చేయాలని ని‌ర్ణయించారు.


నలభై రోజుల శిక్షణ... ఇదీ ఫీజు... దీనిపై ఆర్టీసీలోని పరిపాలనా విభాగం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ శిక్షణకు ఇంకా ఫీజును నిర్ణయించలేదు. ఇతర జిల్లాల నుంచి వచ్చి శిక్షణ తీసుకునేవారికి హైదరాబాద్‌లో  హాస్టల్ ‌ సౌకర్యం కూడా కల్పించే అవకాశాలున్నాయి. దీనికి అదనపు ఫీజు తీసుకుంటారు. కాగా... 40 రోజుల శిక్షణలో 10 రోజులు థియరీ క్లాసులు, 30 రోజులు ప్రాక్టికల్‌ క్లాసులుంటాయని అధికారులు చెబుతున్నారు. 

Updated Date - 2020-07-14T21:41:50+05:30 IST