ఇతర సేవలకు ఆర్టీసీ డ్రైవర్లు

ABN , First Publish Date - 2020-10-01T08:56:02+05:30 IST

ప్రస్తుతం తక్కువ సంఖ్యలో బస్సులు నడుస్తున్నందున అదనంగా ఉన్న డ్రైవర్లను ఇతర సే వలకు వినియోగించుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్రంలోని 97 డిపోలలో....

ఇతర సేవలకు ఆర్టీసీ డ్రైవర్లు

సెక్యూరిటీ కానిస్టేబుళ్లుగా, డీజిల్‌ బంకుల వద్ద సర్దుబాటు..

97 డిపోలలో 1000 మంది అదనం


హైదరాబాద్‌,సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం తక్కువ సంఖ్యలో  బస్సులు నడుస్తున్నందున అదనంగా ఉన్న డ్రైవర్లను ఇతర సే వలకు వినియోగించుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్రంలోని 97 డిపోలలో ఇలా ఉన్న డ్రైవర్లకు సెక్యూరిటీ కానిస్టేబుల్‌, డీజిల్‌ బం కుల వద్ద, ఇతరిత్రా బాధ్యతలను అప్పగించబోతోంది. ఈ మేరకు ఆర్టీసీ పర్సనల్‌ విభాగం బు ధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలో బస్సులు అరకొరగా నడుస్తున్న సంగతి తెలిసిందే. జిల్లా బస్సులు 5000లో ప్రయాణికుల రద్దీ లేకపోవడంతో రో జుకు దాదాపు 3500 బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. 2518 సిటీ బస్సులలో 25 శాతంకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో 731 బస్సులే నడుస్తున్నాయి.  కర్ణాటక, మహారాష్ట్రలకు నడవాల్సిన 400 బస్సుల్లో 170 మాత్రమే నడుస్తున్నాయి. ఇలా తక్కువ సంఖ్యలో బస్సు లు నడుస్తుండడంతో అన్ని డిపోలలో డ్రైవర్లు అదనంగా ఉన్నారు.దాంతో అటువంటివారి సేవలను ఇతరత్రా వినియోగించుకోవాలని సంస్థ నిర్ణయించింది.


అన్ని డిపోలలో కలిపి 1000 మందికిపైగా డ్రైవర్లు అదనంగా ఉన్నట్లు తేలింది. ఒక్క రంగారెడ్డి రీజియన్‌లోనే 61 మంది ఉన్నారు. వారి పేర్లతో సహా అన్ని వివరాలను ఆయా డిపోలకు పంపించి, ఇతరత్రా సేవల్లో నియమించాలని సంస్థ ఆదేశించింది. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ ఉన్నవారిని సెక్యూరిటీ కానిస్టేబుళ్లుగా, మిగతావారిని డిపోలలోని డీజిల్‌ బంకుల వద్ద, ఇతరత్రా సేవల్లో వినియోగించుకోవాలని ఆదేశించింది. అయితే వీరిని శాశ్వతంగా అవే పోస్టుల్లో కొనసాగించబోమని ప్రకటించింది. తిరిగే బస్సుల సంఖ్య పెరిగితే వారిని మళ్లీ డ్రైవర్లుగా వెనక్కి తీసుకుంటామని తెలిపింది.  గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో  కాలపరిమితి ముగిసిన దాదాపు 1000 బస్సులను పక్కన పెట్టింది. దాంతో ఇప్పటికే ఇక్కడ అదనంగా ఉన్న 400 మంది  డ్రైవర్లను కార్గో సేవలకు వినియోగిస్తోంది. 

Updated Date - 2020-10-01T08:56:02+05:30 IST