మెట్రోకు ఆర్టీసీ బస్సులు?
ABN , First Publish Date - 2020-10-04T08:07:50+05:30 IST
సిటీ బస్సుల భారాన్ని తగ్గించుకోవడానికి ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది.
200 వరకు అద్దెకివ్వాలన్న ప్రతిపాదన
రెండు సంస్థల మధ్య ప్రాథమిక చర్చలు
సిటీ బస్సుల నష్టాల తగ్గింపే లక్ష్యం
హైదరాబాద్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): సిటీ బస్సుల భారాన్ని తగ్గించుకోవడానికి ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే సిటీ బస్సుల రాబడిపై మెట్రో రైలు తీవ్రంగా దెబ్బ కొడుతోంది. ఇలాంటి కష్టాలను ఎదుర్కొనే బదులు.. సిటీ బస్సులను మెట్రోకే అద్దెకిస్తే.. నష్టాలు తగ్గి, కొంతలో కొంతైనా ఆదాయం సమకూరుతుందని భావిస్తోంది. ఈ ప్రతిపాదనపై ఇటీవల రెండు సంస్థల మధ్య ప్రాథమిక చర్చలు జరిగినట్లు తెలిసింది. నగరంలో మెట్రో రైలు అందుబా టులోకి రావడం ఆర్టీసీకి శరాఘాతంగా మారింది. త్వరితగతిన గమ్యస్థానాలకు చేరుతుండటం, కాలుష్యం బారిన పడకపోవడం వంటి మెరుగైన సౌకర్యాల కారణంగా ఐటీ, ఇతర ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, ప్రజలు ఎక్కువగా మెట్రో రైళ్లనే ఆదరిస్తున్నారు.
ప్రధాన రూట్లలో నడిచే బస్సుల్లో ఎక్కే జనం పెద్దగా ఉండటం లేదు. మెట్రో రైళ్లు దిగిన ప్రయాణికులు తమ కాలనీలకు వెళ్లే లింక్ బస్సులను మాత్రమే ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో సిటీ బస్సులపై ఆర్టీసీ దృష్టి పెట్టింది. కాలాతీత, డొక్కు బస్సులను తీసేయడం, బస్సులను మెట్రో రైల్ సంస్థకు అద్దెకివ్వడం వంటి చర్యలు చేపడుతోంది. ఇప్పటికే 800 డొక్కు, కాలాతీత సిటీ బస్సులను పక్కన పెట్టింది. వీటిపై పని చేసే డ్రైవర్లు, కండక్టర్లను కార్గో, పార్శిల్ సేవలకు మళ్లించింది. దీంతో ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో 2518 బస్సులు మాత్రమే మిగిలాయి. వీటిలో మరో 200 వరకు బస్సులను మెట్రోకు అద్దెకివ్వాలని యోచిస్తోంది.
నిజానికి మెట్రో, ఆర్టీసీ మధ్య ఇదివరకే ఒక ఒప్పందం కుదిరింది. మెట్రో, ఆర్టీసీ ప్రయాణికులకు ఒకే కాంబో బస్ పాస్‌ను ఇవ్వాలని, తద్వారా మెట్రో రైలు దిగగానే ప్రయాణికులు తమ కాలనీలకు వెళ్లడానికి బస్సుల్లో అనుమతించాలన్న ఒప్పందం కుదిరింది. కానీ... కాంబో బస్ పాస్‌లు అమల్లోకి రాలేదు. ఎలాగూ మెట్రోకు బస్సులను అనుసంధానించాలన్న పాత ప్రతిపాదన ఉన్నందున.. బస్సులనే మెట్రో రైల్ సంస్థకు ఇవ్వాలని ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు. దీనికి మెట్రో రైల్ అధికారులు కూడా కొంత సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఒక అవగాహనకు కూడా వచ్చారు. ఏయే రూట్లలో బస్సులను నడపాలి, ఎన్ని బస్సులను అద్దెకు తీసుకోవాలన్న అంశంపై ఇరు వర్గాలు చర్చలు జరుపుతున్నాయి. అయితే... అద్దెకిచ్చే ప్రతిపాదన మాత్రం కిలో మీటర్ల ప్రాతిపదికన ఉండబోతుందని తెలిసింది.
ఆర్టీసీని మూసేసే ప్రక్రియలో భాగమే... కె.రాజిరెడ్డి, ఈయూ ప్రధాన కార్యదర్శి
ఆర్టీసీని మూసేసే ప్రక్రియలో భాగంగానే బస్సులను మెట్రోకు అద్దెకిచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే సిటీలో 800 బస్సులను పక్కన పెట్టారు. మరిన్ని బస్సులను మెట్రోకు అద్దెకివ్వడానికి ప్రయత్నిస్తున్నారు. నిజానికి ఆర్టీసీని అభివృద్ధి చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు.