ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కేనా?

ABN , First Publish Date - 2020-05-17T09:43:08+05:30 IST

రాష్ట్రంలో బస్సు సర్వీసులను పాక్షింగా ప్రారంభించేందుకు ఇటు ప్రభుత్వం, అటు ఆర్టీసీ సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. మొదటి దశలో లాంగ్‌ టూర్‌ నాన్‌స్టాప్‌...

ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కేనా?

నేటితో ముగియనున్న కేంద్రం లాక్‌డౌన్‌

మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం

యథాతథంగా అమలు చేసే యోచనలో రాష్ట్రం


హైదరాబాద్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బస్సు సర్వీసులను పాక్షింగా ప్రారంభించేందుకు ఇటు ప్రభుత్వం, అటు ఆర్టీసీ సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. మొదటి దశలో లాంగ్‌ టూర్‌ నాన్‌స్టాప్‌ బస్సులను నడపడానికి కార్యాచరణ సిద్ధం చేశాయి. అయితే... కేంద్రం ఇచ్చే సడలింపుల ఆధారంగా ఈ విషయమై తుది నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నాయి. కరోనా లాక్‌డౌన్‌ నుంచి దఫాదఫాలుగా ఎంపిక చేసిన సేవలకు కేంద్రం సడలింపులు ఇస్తూ వస్తోంది. ఇటీవలే కొన్ని ప్రత్యేక రైళ్లకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థ పరిధిలోని బస్సులను కూడా 50శాతం సీట్ల భర్తీతో నడుపుకోవచ్చని అనుమతిచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం  ధైర్యం చేయలేకపోయింది. బస్సులను అనుమతిస్తే... జనం రాకపోకలు పెరుగుతాయని, తద్వారా వైరస్‌ వ్యాప్తి చెందుతుందన్న ఆందోళనతో వెనకడుగు వేసింది. తాజాగా శుక్రవారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బస్సులకు అనుమతి లభిస్తుందని అందరూ భావించినా.. మళ్లీ వాయిదా పడింది. వాస్తవానికి కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ గడువు ఈ నెల 17తో ముగియనుంది. ఆ తర్వాత లాక్‌డౌన్‌ను పొడిగించినా, విరమించినా... మరిన్ని సేవలకు సడలింపులు ఇవ్వనుంది. వాటిని యథాతథంగా అమలు చేసే ఆలోచనలో రాష్ట్రం ఉంది. ఇప్పటికే 50 శాతం సీట్ల భర్తీతో బస్సులు నడపడానికి అవకాశం ఉన్నా... కేంద్రం ఇం కా ఎలాంటి సడలింపులు ఇస్తుందోనని ప్రభుత్వం వేచి చూస్తోంది.


ఇప్పటికే కర్ణాటక, హరియాణా రాష్ట్రా లు బస్సులు నడపాలని నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రం సైతం ఆ దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. బస్సులకు అనుమతి ఇచ్చి భౌతిక దూరం కచ్చితంగా పాటించేలా చూడాలన్నది ప్రభుత్వ యోచనగా ఉంది. అయితే... బస్సులు నడపడానికి ప్రభుత్వం అనుమతిస్తే మొదట లాంగ్‌ టూర్‌ బస్సులను నడపడానికి ఆర్టీసీ కసరత్తు పూర్తి చేసింది. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్లగొడ, మహబూబ్‌నగర్‌ వంటి దూర ప్రాంతాలకు నాన్‌స్టాప్‌ సర్వీసులు నడపనుంది. పొరుగున ఏపీలోని ముఖ్యమైన ప్రాంతాలకు బస్సులు నడిపేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది. 50శాతం సీట్ల భర్తీతో బస్సులు నడిపితే తీవ్ర నష్టం వచ్చే అవకాశాలున్నందున.. 25-30 శాతం మేర చార్జీలు పెంచే విషయంపైనా చర్చ జరుగుతోంది. 

Updated Date - 2020-05-17T09:43:08+05:30 IST