ముత్తిరెడ్డి ఆక్రమణలో రూ.8 కోట్ల చెరువు జాగా!
ABN , First Publish Date - 2020-11-13T09:10:17+05:30 IST
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. చేర్యాలలో చెరువు మత్తడి కింద ఉన్న రూ.8 కోట్ల విలువైన 2,540 గజాల స్థలాన్ని ఆక్రమించారని సిద్దిపేట
నకిలీ పత్రాలతో ఆక్రమించిన జనగామ ఎమ్మెల్యే
లోకాయుక్తకు సిద్దిపేట జిల్లా అఖిలపక్షం ఫిర్యాదు
పంజాగుట్ట, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. చేర్యాలలో చెరువు మత్తడి కింద ఉన్న రూ.8 కోట్ల విలువైన 2,540 గజాల స్థలాన్ని ఆక్రమించారని సిద్దిపేట జిల్లా అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. గురువారం హైదరాబాద్‌లోలోకాయుక్తకు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అనంతరం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిద్దిపేట జిల్లా సీపీఎం కార్యదర్శి మల్లారెడ్డి, ఏఐఎ్‌ఫబీ నేత అందె బీరయ్య, జిల్లా కార్యదర్శి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కొమ్ము నర్సింగరావు, చేర్యాల మండల సీపీఐ కార్యదర్శి అందె అశోక్ తదితరులు మాట్లాడారు.
చేర్యాలలో పెద్ద చెరువు మత్తడి కింద ఉన్న స్థలాన్ని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆక్రమించి.. కూతురు, అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. నీటి ప్రవాహానికి వ్యతిరేకంగా, చెరువు మత్తడి కింద ఉన్న స్థలంలో వాణిజ్య సముదాయం నిర్మించాలని చూస్తున్నారన్నారు.
అదే జరిగితే భారీ వర్షాలకు చేర్యాల మునిగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై మున్సిపల్, రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని తెలిపారు.