ముంపు బాధితులకు rs. 50,000

ABN , First Publish Date - 2020-11-25T07:03:13+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ తమ మేనిఫేస్టోను విడుదల చేసింది. ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తే ముంపు బాధితుల కుటుంబాలకు రూ.

ముంపు బాధితులకు rs. 50,000

పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.5 లక్షలు.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా

ఉచితంగా 30 వేల లీటర్ల మంచినీళ్లు 

సొంత జాగా ఉంటే ఇంటి నిర్మాణానికి 8 లక్షలు

ఆరోగ్య శ్రీ పరిధిలోకి కరోనా చికిత్స

పాతబస్తీ వరకూ మెట్రో రైలు విస్తరణ 

మహిళలు, విద్యార్థులు, వృద్ధులు దివ్యాంగులకు 

బస్సుల్లో, మెట్రో రైళ్లలో ఉచిత ప్రయాణం

100 యూనిట్లలోపు ‘విద్యుత్తు’కు రాయితీ

లాక్‌డౌన్‌ కాలానికి విద్యుత్తు బిల్లుల రద్దు

సఫాయీలు, వారి కుటుంబాలకు 25లక్షల బీమా

ఏడాదిలోగా మూసీ నది ప్రక్షాళన 

రాత్రి 10 గంటలకు మద్యం షాపులు బంద్‌

ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ గణపతి విగ్రహాల నిషేధం  

జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ మేనిఫెస్టో


హైదరాబాద్‌, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ తమ మేనిఫేస్టోను విడుదల చేసింది. ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తే ముంపు బాధితుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున నగదు అందజేస్తామని ప్రకటించింది. వర్షాలు, వరదలతో పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.5లక్షల చొప్పున.. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.2.5లక్షల చొప్పున పరి హారం ఇస్తామని పేర్కొంది. వర్షాలు, వరదల కారణంగా మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఇందిరాభవన్‌లో మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ రేవంత్‌ రెడ్డి తదితరులతో కలిసి కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మణిక్కం ఠాకూర్‌, జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనిఫేస్టోను విడుదల చేశారు.


ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే ఇంటికి 30వేల లీటర్ల దాకా మంచినీటిని ఉచితంగా సరఫరా చేస్తామని టీపీపీసీ ప్రకటించింది. సొంత జాగా ఉన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు రూ. 8లక్షల దాకా సాయం చేస్తామని, సింగిల్‌ బెడ్‌ రూం ఉంటే అదనపు గది నిర్మాణానికి రూ. 4 లక్షల మేరకు మంజూరు చేస్తామన్నారు. అర్హులైన అందరికీ రెండు పడకగదుల ఇళ్లను మంజూరు చేస్తామని, ఆ ఇళ్లు లబ్ధిదారుల చేతికి వచ్చే వరకు ఇంటి కిరాయి కింద రూ. 60 వేల చొప్పున ఇస్తామన్నారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తామని ప్రకటించారు.


నగరంలో మహిళలు, విద్యార్థులు, దివ్యాంగులు, వృద్ధులకు ఆర్టీసీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్‌ రైళ్లలో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తామని  ప్రకటించింది. మెట్రో, ఎంఎంటీఎస్‌ సేవలను ఓల్డ్‌సిటీ, శంషాబాద్‌ విమానాశ్రయం వరకూ విస్తరిస్తామని హామీ ఇచ్చింది.  కాగా మేనిఫెస్టోలో పలు కీలక హామీలతో పాటుగా హైదరాబాద్‌ అభివృద్ధికి వివిధ రంగాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వా లు చేసిన కృషిని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలనూ పేర్కొన్నారు. గతంలో అభివృద్ధిని తామే చేశామని, మళ్లీ తామే చేయగలుగుతామన్న వ్యాఖ్యతో మేనిఫెస్టోను ముగించారు. 


మెట్రో తెచ్చాం.. ఈ హామీలూ సాధిస్తాం: ఉత్తమ్‌ 

‘‘మెట్రోరైల్‌, హైదరాబాద్‌కు గోదావరి, కృష్ణా నీళ్లు, ఔటర్‌ రింగ్‌రోడ్డు.. వంటివి వస్తాయని ఎవరైనా ఊహించారా? కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం వీటిని తెచ్చింది. ఇన్ని అద్భుతాలు సాధించిన మేము.. మెట్రోను పాత నగరం వరకూ విస్తరించడం సహా మేనిఫెస్టోలోని హామీలనూ తప్పనిసరిగా అమలు చేస్తాం’’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఏ విధంగా ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్నది తమకు తెలుసునన్నారు. మేనిఫెస్టోలోని హామీల అమలుకు జీహెచ్‌ఎంసీ నిధులు సరిపోతాయా? అన్న ప్రశ్నకు ఆయన  స్పందించారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఇతర హామీలు


హైదరాబాద్‌కు విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపకల్పన. చెరువుల సంరక్షణ అథారిటీని ఏర్పాటు. చెరువులు కబ్జాలకు గురికాకుండా చర్యలు. హెచ్‌ఎండిఏ పరిధిలో ఓ సమగ్ర డ్రెయినేజీ వ్యవస్థను రూపకల్పన.. అమలు.

గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌.. ఇతర ఆస్పత్రులు ప్రత్యేకంగా మెరుగుపరచడం. బస్తీ దవాఖానాల సంఖ్య 450కి పెంపు. ఆ ఆస్పత్రుల పనివేళలలు రాత్రి 9దాకా. అన్ని ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా వైద్య పరీక్షలు, ఉచిత ఔషధాలు అందజేత. ప్రతి 100 దవాఖానాలకు ఒక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి. హైదరాబాద్‌లో మలేరియా, డెంగ్యూ జ్వరాల నిరోధానికి స్పెషల్‌ డ్రైవ్‌.  

కార్పొరేటు, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాల ఫీజుల నియంత్రణ, క్రమబద్ధీకరణకు హైదరాబాద్‌ స్కూల్స్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌, పౌరసంస్థలతో కలిసి పనిచేయడం. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, సురక్షితమైన తాగునీరు. అన్ని డివిజన్లలో విద్యార్థులకు రీడింగ్‌ రూమ్‌లు, ఈ-లైబ్రరీలు, ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయాల కల్పన. 

ఆస్తి పన్ను హేతుబద్ధీకరణ. స్వల్ప, మధ్య ఆదాయ వర్గాలకు మేలు చేసేందుక 50,000 వరకు పన్నులో రాయితీ

100 యూనిట్లలోపు విద్యుత్తును ఉపయోగించుకునే గృహ వినియోగదారులకు విద్యుత్తు రాయితీ. లాక్‌డౌన్‌ కాలానికి ఆస్తి పన్ను, మోటారు వాహన పన్ను, విద్యుత్తు బిల్లుల రద్దు. 80 గజాలు అంతకంటే తక్కువ జాగాలో ఇండ్లు కట్టుకొన్న వారికి ఆస్తిపన్ను రద్దు. క్షురకులు, రజకులు, వడ్రంగులు, విశ్వకర్మలకు చెందిన దుకాణాలకు ఆస్తి పన్నుతోపాటు విద్యుత్తు బిల్లులూ మాఫీ.  

ఎలాంటి రుసుమూ లేకుండా భూముల, భవనాల క్రమబద్ధీకరణ పథకం అమలుకోసం, ధరణి పోర్టల్‌ రద్దుకు ప్రభుత్వం ఒత్తిడి. 

అన్ని డివిజన్లలో నైపుణ్యాల అభివృద్థి కేంద్రాల ఏర్పాటు.  కరోనాతో దెబ్బతిన్న రంగాలకు నిరుద్యోగ అలవెన్సులు, జీహెచ్‌ఎంసీ లైబ్రరీలలో దివ్యాంగులకు ఉద్యోగాలు

మురికివాడల అభివృద్థి అథారిటీ ఏర్పాటు. అందులో ఎన్జీవోలు, పౌర సమాజ ప్రతినిధులకు భాగస్వామ్యం.  2021 చివరినాటికల్లా సమగ్రమైన సివరేజ్‌ విధానం. ఏడాదిలోగా మూసీనదిని ప్రక్షాళన. ఆ నది నీళ్లు ఉపయోగపడేలా చర్యలు. మూసీ పొడవునా పర్యాటకుల్ని ఆకర్షించేలా అభివృద్థి.   

సపాయి కర్మచారీలు, వారి కుటుంబాలకు రూ.25 లక్షల వరకు బీమా. 

నగరంలోని ప్రతిమూలకు అన్నపూర్ణ క్యాంటీన్లను అందుబాటు కోసం వాటి సంఖ్యను పెంపు. 

సింగిల్‌ స్ర్కీన్‌ సినిమా హాళ్లకు పన్ను తగ్గింపు. మాల్స్‌, మల్టీప్లెక్స్‌లలో సినిమా టిక్కెట్ల ధరల నియంత్రణ.  

కచ్చితంగా రాత్రి 10 గంటలకల్లా మద్యం దుకాణాలు, బార్లు మూసివేత

ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో చేసే గణేశ్‌ విగ్రహాలను నిషేధించి.. మట్టి గణేశ్‌ విగ్రహాల ఏర్పాటుకు చర్యలు.


Read more