పులి దాడి మృతుడి కుటుంబానికి రూ.5లక్షలు
ABN , First Publish Date - 2020-11-13T09:19:56+05:30 IST
ఆసిఫాబాద్ జిల్లాలోని దహేగాం మండలంలో పులి దాడి చేయడంతో విఘ్నేశ్ మృతి చెందడంపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అటవీశాఖ
అటవీ శాఖ తరఫున పరిహారం: మంత్రి ఇంద్రకరణ్
మేడ్చల్/హైదరాబాద్, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్ జిల్లాలోని దహేగాం మండలంలో పులి దాడి చేయడంతో విఘ్నేశ్ మృతి చెందడంపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అటవీశాఖ తరఫున విఘ్నేశ్ కుటుంబానికి రూ.5లక్షల పరిహారం అందజేయనున్నట్లు ప్రకటించారు. గుండ్లపోచంపల్లి పరిధిలోని ఓఆర్‌ఆర్‌కు సమీపంలో మేడ్చల్ జిల్లా అటవీశాఖ కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా శాఖ అధికారులు నిరంతరం పని చేస్తున్నారని తెలిపారు. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉండే వారికి ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు అర్బన్ ఫారెస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
మేడ్చల్ జిల్లాలో పచ్చదనం పెంపునకు కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఎంతగానో శ్రమిస్తున్నారని ప్రశంసించారు. అటవీ శాఖ కార్యాలయం నిర్మించడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. అనంతరం రూ.20లక్షల వ్యయంతో నిర్మించనున్న డీఆర్వో క్వార్టర్స్‌కు మంత్రులు భూమిపూజ చేశారు.