హెచ్‌ఎండీఏలో రూ.కోటి మాయం

ABN , First Publish Date - 2020-06-22T09:40:55+05:30 IST

హెచ్‌ఎండీఏలో రెండు నెలల్లో కోటి రూపాయలు మింగేశారు. ఇదేదో సైబర్‌ నేరస్థులు చేసిన పనికాదు.

హెచ్‌ఎండీఏలో రూ.కోటి మాయం

లాక్‌డౌన్‌లో ఆఫీసుకే రాని అధికారులు

అలవెన్సులు, కార్ల అద్దెల పేరిట బిల్లుల డ్రా


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): హెచ్‌ఎండీఏలో రెండు నెలల్లో కోటి రూపాయలు మింగేశారు. ఇదేదో సైబర్‌ నేరస్థులు చేసిన పనికాదు. హెచ్‌ఎండీఏలోని ఉన్నతాధికారుల అండదండలతో కిందిస్థాయి అధికారులు, ఉద్యోగులు చేసిన నిర్వాకం. లాక్‌డౌన్‌లో అత్యధిక మంది ఉద్యోగులు విధులకు హాజరు కాకపోయినా కొందరు ఆఫీసు నిర్వహణ చేపట్టినట్లు బిల్లులు సృష్టించారు. ఇంప్రెస్ట్‌ బిల్లుల దగ్గర నుంచి కన్వేయన్స్‌ అలవెన్స్‌లు, కార్ల అద్దెలు ఇలా అవకాశమున్న ప్రతి వనరునూ వాడేసుకుని హెచ్‌ఎండీఏ ఖజానాకు చిల్లు పెట్టారు. వాస్తవానికి హెచ్‌ఎండీఏలో ఉన్నతాధికారుల నుంచి వివిధ హోదాలో గల అధికారులకు విధుల కోసం కారు సౌకర్యం కల్పించారు. ఉన్నతాధికారులు వినియోగించే ఇన్నోవా కార్లకు నెలకు రూ.50వేల చొప్పున, ఇతర అధికారుల మినీ కార్లకు నెలకు రూ.34వేల చొప్పున అద్దెలు చెల్లిస్తున్నారు. అయితే కొంతమంది అధికారులు అద్దె కార్లను కాకుండా సొంత కార్లనే వినియోగిస్తున్నారు.


పైగా.. లాక్‌డౌన్‌ సమయంలో ఇంజనీరింగ్‌ విభాగంలో వివిధ ప్రాజెక్టు విభాగాలకు చెందిన కొంతమంది అధికారులు తప్ప.. ఏ ఒక్కరూ కార్లలో కిలోమీటర్‌ కూడా తిరగలేదు. అయినా కార్ల అద్దెలను ఎత్తేశారు. ఇలా రెండు నెలల కాలానికిగా రూ.30లక్షలకు పైగా కార్ల అద్దెలను అధికారులే తీసుకోవడం గమనార్హం. వీటికితోడు పెద్దమొత్తంలో ఇంప్రెస్ట్‌ బిల్లులు కూడా ఎత్తేశారు. సాధారణ రోజుల్లో వివిధ విభాగాల నిర్వహణ, సందర్శకులకు టీలు, ఇతరత్రా ఖర్చుల కోసం ప్రతినెలా రూ.8వేల నుంచి 15వేల వరకు ఈ బిల్లులు పెడుతారు. కానీ లాక్‌డౌన్‌ సమయంలో ఆఫీసు నిర్వహణ లేకపోయినా బిల్లులు ఎత్తుకున్నారు. వీరే కాకుండా.. హెచ్‌ఎండీఏలోని వివిధ విభాగాల ఉన్నతాధికారుల వద్ద కంప్యూటర్‌ ఆపరేటర్లుగా పని చేసే ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది కూడా లాక్‌డౌన్‌ సమయంలో ఆఫీసుకు రాకపోయినా కన్వేయన్స్‌ బిల్లులను ఎత్తేశారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా ఇటువంటి వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాలని, బిల్లులను రికవరీ చేయాలని హెచ్‌ఎండీఏలోని ఉద్యోగులే కోరుతున్నారు. 

Updated Date - 2020-06-22T09:40:55+05:30 IST