రోడ్లు తెగి.. చెరువులు పొంగి..
ABN , First Publish Date - 2020-09-20T07:29:41+05:30 IST
రైతులకు చినుకు వణుకు పుట్టిస్తోంది. అదేపనిగా కురుస్తూ పంటలను వరదలో ముంచెత్తుతోంది. వానకు వాగులు పొంగిపొర్లుతున్నాయి.

సాగర్‌కు 4.60 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
రాష్ట్రాన్ని వదలని వర్షం
మహబూబ్‌నగర్‌లో యువకుడు గల్లంతు
నాగర్‌కర్నూల్‌లో ఇల్లుకూలి చిన్నారి మృతి
చంపాపేట నాలాలో కొట్టుకొచ్చిన మహిళ కాలు
కొట్టుకుపోయిన యాదాద్రి ఘాట్‌రోడ్డు
మానవపాడు-10.6, అచ్చంపేట-7.2 సెం.మీ
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
రైతులకు చినుకు వణుకు పుట్టిస్తోంది. అదేపనిగా కురుస్తూ పంటలను వరదలో ముంచెత్తుతోంది. వానకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. రహదార్లు కోసుకుపోతున్నాయి. చెరువు కట్టలు తెగిపోతున్నాయి. పాత ఇళ్లు కూలిపోతున్నాయి. చుట్టూ నీరు చేరడంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పత్తి చేలలో నీళ్లు చేరాయి.పూత, కాతనేలరాలుతోంది. మొక్కజొన్న కంకుల్లో నీళ్లు చేరి గింజలు నల్లబారుతున్నాయి.
రాష్ట్రంలో వరుసగా నాలుగోరోజూ పలుచోట్ల భారీ వర్షం పడింది. మహబూబ్‌నగర్ జిల్లాలో దుందుభి, ఊకచెట్టువాగు, పెద్దవాగు పొంగి ప్రవహించాయి. జిల్లా వ్యాప్తంగా 120 చెరువులు నిండి అలుగులు పోస్తున్నాయి. జిల్లాలో 22 ఇళ్లు ఈ వానకు దెబ్బతిన్నట్లు గుర్తించారు. అడ్డాకుల మండలం శాఖాపూర్ దగ్గర జాతీయ రహదారి కోతకు గురైంది. జడ్చర్ల మండలం లింగంపేట చెక్‌డ్యాం వద్ద స్నేహితులతో కలిసి సెల్ఫీ తీసుకుంటూ ఈత కొట్టేందుకు ప్రయత్నించిన లింగంపేటకు చెందిన అఫ్రోజ్ అలియాస్ అబ్బు(25) అనే యువకుడు గల్లంతయ్యాడు.
నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం భలాన్‌పల్లిలో ఇల్లు కూలిపోయి పూజ అనే నాలుగేళ్ల చిన్నారి మృతిచెందింది. జిల్లాలో 28 గ్రామాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. హైదరాబాద్ చంపాపేట రెడ్డి కాలనీలోని ఓ నాలాలో మహిళ కాలు కొట్టుకొని వచ్చింది. మహిళలను ఎవరైనా హత్యచేసి నాలాలో పడేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమైంది. హయత్‌నగర్, ఎల్బీనగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయి. వాహనదారులు లైట్లు వేసుకొని వెళ్లారు.

గద్వాల జిల్లా మానవపాడు మండలం 10.6 సెం.మీ, నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో 7.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. గద్వాల జిల్లా వ్యాప్తంగా 7.19, హైదరాబాద్‌లో చర్లపల్లి, కాప్రా, అబుల్లాపూర్‌మెట్ తదితర ప్రాంతాల్లో 3సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
యాదగిరిగుట్టలో శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం మొదటి ఘాట్‌రోడ్డు వద్ద రోడ్డు కొట్టుకుపోయింది. అక్కడ పెద్ద గుంత ఏర్పడింది. ఆలయ విస్తరణ పనుల కారణంగా మొదటి ఘాట్‌రోడ్డునే ప్రస్తుతం వినియోగిస్తున్నారు. ఘాట్‌రోడ్డు ప్రారంభంలోనే భారీగా కయ్యలు ఏర్పడ్డాయి. గుంతను త్వరగా పూడ్చకపోతే ఘాట్‌రోడ్డు దెబ్బతినే అవకాశం ఉంది.
