ట్రాక్టర్‌ను ఢీకొన్న బొగ్గు లారీ 12 మంది దుర్మరణం
ABN , First Publish Date - 2020-06-18T09:13:42+05:30 IST
మొక్కు చెల్లించేందుకు వెళ్లిన వారిని బొగ్గు లారీ మింగేసింది. బంధుమిత్రులతో కలిసి ట్రాక్టర్‌పై లక్ష్మీ నర్సింహస్వామి పుణ్యక్షేత్రానికి వెళ్లిన వారు ఇంటికొస్తుండగా మృత్యువు కబళించింది.

- కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- మొక్కు తీర్చుకుని వెళ్తూ అనంతలోకాలకు
- విడిపోయి పల్టీ కొట్టిన ట్రాక్టర్ ట్రాలీ
- అంతా ఒకే కుటుంబీకులు.. బంధువులు
- మృతుల్లో 9 మంది తెలంగాణ వారే
- మరో 14 మందికి తీవ్ర గాయాలు
మధిర/ఎర్రుపాలెం/జగ్గయ్యపేట రూరల్/హైదరాబాద్, జూన్ 17(ఆంధ్రజ్యోతి): మొక్కు చెల్లించేందుకు వెళ్లిన వారిని బొగ్గు లారీ మింగేసింది. బంధుమిత్రులతో కలిసి ట్రాక్టర్‌పై లక్ష్మీ నర్సింహస్వామి పుణ్యక్షేత్రానికి వెళ్లిన వారు ఇంటికొస్తుండగా మృత్యువు కబళించింది. చనిపోయిన 12 మందిలో 9 మంది ఖమ్మం జిల్లా వాసులు, ముగ్గురు ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన వారున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెద్ద గోపారానికి చెందిన రైతు వేమిరెడ్డి గోపిరెడ్డి కుటుంబం బంధువులతో కలిసి 26 మంది ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకొని మొక్కు చెల్లించేందుకు మంగళవారం ట్రాక్టర్‌పై వెళ్లారు. రాత్రి వేదాద్రిలోనే బస చేసి బుధవారం ఉదయం మొక్కులు చెల్లించారు. మధ్యాహ్నం అక్కడే భోజనాలు చేసి తిరుగు ప్రయాణం అయ్యారు.
వేదాద్రి రోడ్డు నుంచి సమీపంలోని ప్రధాన రహదారిపైకి ఎక్కే సమయంలో ట్రాక్టర్‌ను ఓ లారీ ఢీ కొట్టింది. దీంతో ట్రాక్టర్ ఇంజన్ నుంచి విడిపోయిన ట్రక్కు రోడ్డు పక్కకు పల్టీ కొట్టింది. ట్రాక్టర్ నడుపుతున్న రైతు గోపిరెడ్డి క్షేమంగా బయటపడగా.. ట్రక్కులో ఉన్న వారిలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంలో మరో ఇద్దరు చనిపోయారు. తీవ్రంగా గాయపడిన మరో 14 మందిని ఖమ్మం ఆస్పత్రిలో చేర్చారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఏడుగురు ఎర్రుపాలెం మండలం గోపారానికి చెందిన వారు, ఇద్దరు జమలాపురం వాస్తవ్యులు ఉన్నారు.
మృతులంతా బంధువులే..
మృతుల్లో వేమిరెడ్డి పుల్లారెడ్డి(75), వేమిరెడ్డి భారతమ్మ(60), వేమిరెడ్డి పద్మావతి(56), వేమిరెడ్డి ఉదయశ్రీ(7), లక్కిరెడ్డి రాజేశ్వరి(26), వేమిరెడ్డి కళ్యాణి(18-ఇంటర్ విద్యార్థిని), శీలం లక్ష్మి(20-డిగ్రీ విద్యార్థిని) పెద్దగోపారానికి చెందిన వారు. గూడూరు అప్పమ్మ(40), గూడూరు తిరుపతమ్మ(60) ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామానికి చెందిన వారు. గూడూరు సూర్యనారాయణరెడ్డి(60), గూడూరు రమణమ్మ(50), గూడూరు ఉపేందర్‌రెడ్డి(15) కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన వారు ఉన్నారు. మృతులంతా దగ్గరి బంధువులే కావడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. గోపిరెడ్డి క్షేమంగా ఉన్నా ఆయన తాత పుల్లారెడ్డి, నాయనమ్మ భారతమ్మ, తల్లి పద్మావతి, కూతురు ఉదయశ్రీ మృతి చెందారు. జమలాపురానికి చెందిన తల్లీకూతురు అప్పమ్మ, తిరుపతమ్మ కూడా చనిపోయారు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన గూడూరు సూర్యనారాయణ రెడ్డి, గూడూరు రమణమ్మ, గూడూరు ఉపేందర్‌రెడ్డి కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు.
రోడ్డు ప్రమాదంలో 12 మంది చనిపోవడం, పలువురు గాయపడడం పట్ల గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ నామా, మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. ఖమ్మం ఆస్పత్రిలో క్షతగాత్రులను పువ్వాడ పరామర్శించారు.
కరోనా భయంతో కాపాడేందుకు రాలేదు
బోల్తాపడిన ట్రాక్టర్ ట్రాలీ కింద పలువురు చిక్కుకుపోయారు. మిగిలిన వారు కొంత ఎత్తుకు ఎగిరి చెల్లాచెదురుగా పడిపోయారు. అయినా క్షతగాత్రులను తరలించేందుకు కరోనా భయంతో స్థానికులు ముందుకు రాలేదు. స్థానిక పోలీసు స్టేషన్ నుంచి సీఐ, ఎస్‌ఐ, ఇతర సిబ్బంది వచ్చిన తర్వాతే బాధితుల తరలింపు ప్రారంభమైంది. సీఐ, ఎస్‌ఐలు స్వయంగా మృతదేహాలను వాహనాల్లో ఎక్కించారు.
మింగిన మెరక..
వేదాద్రి పరిసరాలు కొండలు, గుట్టలతో ఘాట్‌రోడ్లను తలపిస్తుంటాయి. డ్రైవర్లు ఎంతో అప్రమత్తతతో వాహనాలు నడపాల్సి ఉంటుంది. వేదాద్రి నుంచి రెండు కిలోమీటర్లు దూరం వెళ్లాక అక్కడంతా మెరకగా ఉంది. డ్రైవరు ట్రాక్టర్‌ను మెరక మీద నుంచి పల్లానికి దించుతున్నాడు. అదే సమయంలో ఎదురుగా బొగ్గు లారీ మెరక ఎక్కుతోంది. మెరక ఎక్కించేందుకు లారీ డ్రైవర్ స్పీడు తగ్గించాల్సింది పోయి మరింత పెంచాడు. దీంతో లారీ అదుపు తప్పి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఆ ధాటికి ట్రాలీ రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకుపోయి పల్టీ కొట్టింది. లోపల ఉన్నవారంతా కిందపడిపోవడం వారిపై ఐరన్ ట్రాలీ పడిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. ట్రాలీ బరువుకు వారిలో చాలామంది అవయవాలు చితికిపోయాయి. మరికొందరికి కాళ్లూచేతులూ విరిగిపోయారు.