రేపటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ!
ABN , First Publish Date - 2020-03-24T09:05:58+05:30 IST
దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో.. దాని అమలుకు పౌరసరఫరాల శాఖ

హైదరాబాద్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో.. దాని అమలుకు పౌరసరఫరాల శాఖ సోమవారం నుంచి కసరత్తు ప్రారంభించింది. బుధవారం నుంచి రాష్ట్రంలో బియ్యం పంపిణీ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.09 కోట్ల కుటుంబాలు ఉండగా 87.59 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. కరోనా విపత్తు నేపథ్యంలో ఒక్కో లబ్ధిదారుడికి 12 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారు. ఈ మేరకు బియ్యం నిల్వలను క్షేత్రస్థాయికి తరలించేందుకు కమిషనరేట్ నుంచి పర్యవేక్షణ జరుగుతోంది. గతంలో నెలవారిగా పంపిణీ చేసినప్పుడు 1.68 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉండేవి.
కిలోకు రూపాయి చొప్పున ప్రతి వ్యక్తికి 6 కిలోలు పంపిణీ చేసేవారు. ఇప్పుడు 12 కిలోలు చొప్పున పంపిణీ చేయబోతుండటంతో 3.36 లక్షల టన్నుల బియ్యం అవసరం అవుతున్నాయి. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వంపై రూ.1,103 కోట్ల ఆర్థిక బారం పడుతోంది. ఈ బియ్యాన్ని వీలైనంత త్వరగా సంబంధిత గ్రామాలు, పట్టణాలకు చేర్చాలని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, డీఎ్‌సవోలకు పౌర సరఫరాల కమిషనర్ సత్యనారాయణరెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఏప్రిల్‌కు సంబంధించిన బియ్యం కోటా మూవ్‌మెంట్ ఈ నెల 16 నుంచే ప్రారంభమైంది.
కరీంనగర్, వరంగల్‌లతో పాటు పలు జిల్లాలకు బియ్యం చేరాయి. అయితే చేరిన బియ్యం 6 కిలోల లెక్కన చేరాయి. ఇప్పుడు 12 కిలోలు ఇవ్వాల్సి వస్తున్నందున, మిగిలినవి 6 కిలోల బియ్యం కూడా చేరవేయాల్సి ఉంటుంది. అవి కూడా రెండు, మూడు రోజుల్లోనే సంబంధిత గ్రామాలు, పట్టణాలకు చేర్చాలని కమిషనరేట్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. ప్రతి రేషన్ కార్డుకు రూ.1,500 చొప్పున పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధుల పంపిణీకి ఈ- కుబేర్ సాఫ్ట్‌వేర్‌ను వాడనున్నారు.