‘భగీరథ’ పనుల్లో నిర్లక్ష్యం తగదు

ABN , First Publish Date - 2020-12-29T04:36:42+05:30 IST

‘భగీరథ’ పనుల్లో నిర్లక్ష్యం తగదు

‘భగీరథ’ పనుల్లో నిర్లక్ష్యం తగదు
కలెక్టరేట్‌లో అర్బన్‌ జిల్లా కలెక్టర్‌తో కలిసి సమీక్ష నిర్వహిస్తున్న ఈఎన్‌సీ ధన్‌సింగ్‌

మార్చి ఒకటి నుంచి ప్రతీరోజు నీటి సరఫరా జరగాల్సిందే..

ఈఎన్‌సీ ధన్‌సింగ్‌


వరంగల్‌ సిటీ, డిసెంబరు 28 : అర్బన్‌ మిషన్‌ భగీరథ పనుల్లో జాప్యంపై మిషన్‌భగీరథ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌(ఈఎన్‌సీ) ధన్‌సింగ్‌ జీడబ్ల్యూఎంసీ, పబ్లిక్‌ హెల్త్‌ ఇంజినీరింగ్‌ అధికారులపై సీరియస్‌ అయ్యారు. పైప్‌లైన్‌ తవ్వకాలు సరిగా పూడ్చి వేయడం లేదని, నగరంలో ఇళ్లు, వ్యాపార సంస్థల ముందు తవ్వకాలను పూర్తి చేయకుండా ఇష్టారాజ్యంగా వదిలిలేశారని మండిపడ్డారు. మట్టిని చదును చేయకుండానే పనులు ముగించారని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, ఇదేం పనితీరంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హన్మకొండ బాలసముద్రంలోని పబ్లిక్‌ హెల్త్‌ ఇంజినీరింగ్‌ కార్యాలయంలో మిషన్‌ భగీరథపై సోమవారం సమీక్ష జరిపారు. కోర్‌ సిటీలో 87కిలోమీటర్ల పొడవునా మిగిలి ఉన్న పైప్‌లైన్‌ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. తాగునీటి పైప్‌లైన్‌ లీకేజీలను వెంటనే అరికట్టాలన్నారు. 


ప్రతీరోజు నీటి సరఫరా 

2021 మార్చి ఒకటి నుంచి నగరంలో ప్రతీరోజు నీటి సరఫరా జరగాల్సిందేనని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ధన్‌సింగ్‌ అధికారులను హెచ్చరించారు. మిషన్‌భగీరథ పనులు పూర్తి  చేసేందుకు జీడబ్ల్యూఎంసీలో రిటైర్డ్‌ ఇంజినీర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో నియమించుకోవచ్చని తెలిపారు. ఈ క్రమంలో రిటైర్డ్‌ డీఈ వెంకటరమణాచారితో పాటు డీఈ ఆనంద్‌, రిటైర్డ్‌ ఏఈ సాంబమూర్తిని పిలిపించుకొని నియామకాన్ని పరిశీలించారు. మరి కొందరు డీఈలకు కూడా ఫోన్‌ చేసి నియామకాల విషయాన్ని వివరించారు. రిటైర్డ్‌ ఇంజినీర్లు కూడా సానుకూలంగా స్పందించారు. ఇకపై ప్రతీ సోమవారం మిషన్‌భగీరథ పనులపై సమీక్షిస్తానని,  క్షేత్రస్థాయిలో పనులను తనిఖీ చేస్తానని ధన్‌సింగ్‌ వెల్లడించారు.  


కలెక్టరేట్‌లో సమీక్ష 

పబ్లిక్‌హెల్త్‌ ఇంజినీరింగ్‌ కార్యాలయంలో సమీక్ష అనంతరం వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతుతో కలిసి అధికారులతో సమీక్ష జరిపారు. భగీరథ ద్వారా తాగునీటి సరఫరా కోసం రూ.1085 కోట్లతో పనులు చేపట్టినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. అవసరమైన మేరకు కార్మికుల నియామకాలు జరపాలని ఽసూచించారు. పేదలకు ఒక్క రూపాయి నల్లా కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించారు. 

Updated Date - 2020-12-29T04:36:42+05:30 IST