సారథుల్లేకుండా ప్రక్షాళన ఎలా?

ABN , First Publish Date - 2020-07-20T09:23:48+05:30 IST

ప్రజల జీవితాలతో ముడిపడిన రెవెన్యూ శాఖకు ఇప్పటిదాకా మంత్రే లేరు.. ఆరు నెలలుగా రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పోస్టు ఖాళీగా ఉంది..

సారథుల్లేకుండా ప్రక్షాళన ఎలా?

  • ఇప్పటికీ రెవెన్యూ శాఖకు మంత్రే లేరు
  • ఆరు నెలలుగా స్పెషల్‌ సీఎస్‌ పోస్టు ఖాళీ
  • నాలుగేళ్లు దాటినా భర్తీ కాని సీసీఎల్‌ఏ


హైదరాబాద్: ప్రజల జీవితాలతో ముడిపడిన రెవెన్యూ శాఖకు ఇప్పటిదాకా మంత్రే లేరు.. ఆరు నెలలుగా రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పోస్టు ఖాళీగా ఉంది.. భూపరిపాలన అంతటికీ బాస్‌గా ఉండే భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) పోస్టులో నాలుగేళ్లుగా ఎవరినీ నియమించలేదు.. రాష్ట్రంలో రెవెన్యూ, విద్యాశాఖల ప్రక్షాళన మాత్రమే మిగిలి ఉందంటూ సీఎం కేసీఆర్‌ తాజాగా ప్రకటించిన నేపథ్యంలో.. సారథుల్లేకుండా ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వాస్తవానికి ప్రభుత్వం రెవెన్యూశాఖను ప్రాధాన్యం లేని జాబితాలో చేర్చింది. కీలకమైన భూరికార్డుల నవీకరణ కూడా సీసీఎల్‌ఏ లేకుండానే జరిగింది. దాంతో నవీకరణపై వచ్చినన్ని విమర్శలు మరే కార్యక్రమంపైనా రాలేదు. రెవెన్యూ శాఖకు మంత్రి లేకపోవడం, సీఎంను కలిసే అవకాశం లేకపోవడంతో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉద్యోగులు ఉన్నారు. మరోవైపు.. రాష్ట్రంలో ఆర్డీవోల పోస్టింగ్‌లన్నీ ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వారికే దక్కుతున్నాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట మంత్రులు సిఫారసు చేస్తున్న వారికే ప్రా ధాన్యం లభిస్తోంది. దాంతో ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో భూపరిపాలన నడుస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. కీలకమైన జాయింట్‌ కలెక్టర్‌ పోస్టులను ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానంలో ప్రతి జిల్లాలో రెండేసి అదనపు కలెక్టర్ల పోస్టులను సృష్టించింది. అందులో ఒకటి స్థానిక సంస్థలకు, మరొకటి రెవెన్యూకు కేటాయించింది. అయితే, వారు ఏయే బాధ్యతలు నిర్వర్తించాలనే దానిపై ఇప్పటికీ మార్గదర్శకాల్లేవు. అలాగే, డీఆర్వో పోస్టు ఉంటుందా? తొలగిస్తే.. ప్రత్యామ్నాయం ఏంటి? అంశాలపై స్పష్టత లేదు.

Updated Date - 2020-07-20T09:23:48+05:30 IST