రేవంత్‌ భూ ఆక్రమణ నిజమే

ABN , First Publish Date - 2020-03-04T08:42:05+05:30 IST

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి, ఆయన సోదరులు కొండల్‌రెడ్డి, కృష్ణారెడ్డి భూ ఆక్రమణకు పాల్పడ్డారని విచారణాధికారి ఆర్డీవో తేల్చారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలోని సర్వే నంబరు 127లో తమ భూములను

రేవంత్‌ భూ ఆక్రమణ  నిజమే

  • తహసీల్దార్‌ మ్యుటేషన్‌ ప్రొసీడింగ్స్‌ తప్పే 
  • గోపన్‌పల్లి భూములపై తేల్చిన ఆర్డీవో
  • ప్రభుత్వ భూమినీ ఆక్రమించినట్లు నిర్ధారణ
  • నివేదిక సమర్పించిన విచారణాధికారి
  • తదుపరి చర్యలకు సిద్ధమవుతున్న సర్కారు

హైదరాబాద్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి, ఆయన సోదరులు కొండల్‌రెడ్డి, కృష్ణారెడ్డి భూ ఆక్రమణకు పాల్పడ్డారని విచారణాధికారి ఆర్డీవో తేల్చారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలోని సర్వే నంబరు 127లో తమ భూములను ఎంపీ, ఆయన సోదరులు ఆక్రమించారంటూ కొందరు చేసిన ఫిర్యాదుల విచారణకు ప్రభుత్వం ఇటీవలే రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళను విచారణాధికారిగా నియమించిన విషయం తెలిసిందే. దీనిపై తన విచారణ నివేదికను ఆమె మంగళవారం ప్రభుత్వానికి సమర్పించారు. రెవెన్యూ రికార్డుల్లోని కాస్రా పహాణీ ప్రకారం సర్వే నంబరు-127లో 10.21 ఎకరాల భూమి 1954-55 నుంచి వడ్డె హనుమ పేరుతో ఉందని నివేదికలో తెలిపారు. ఆ తర్వాత కూడా ‘వడ్డె’ ఇంటి పేరుతో ఉన్న సంబంధీకులు పట్టాదారులుగా ఉన్నారని పేర్కొన్నారు.


అయితే 2005లో ఎ.రేవంత్‌రెడ్డి, 2014 తర్వాత ఎ.కొండల్‌రెడ్డి సర్వేనెంబరు 127లో కొంత భూమికి కొనుగోలుదారులుగా ఉన్నారని తెలిపారు. అయితే సర్వే నంబరు 127లో తాను 31 గుంటలు, తన సోదరుడు 1.21 ఎకరాల భూమిని ఇరగండ్ల లక్ష్మయ్య నుంచి కొనుగోలు చేసినట్టు రేవంత్‌ రెడ్డి చెప్పారని, కానీ.. ఈ సర్వే నంబరులో ఇరగండ్ల ఇంటిపేరుతో పట్టాదారే లేరని ఆర్డీవో తేల్చారు. పైగా సర్వే నంబరు 127లో మొత్తం 10.21 ఎకరాలు ఉండగా.. ఎంపీ, ఆయన సోదరులు 12.02 ఎకరాలను ఆక్రమించుకుని ప్రహరీ నిర్మించారని తెలిపారు. అదనంగా ఆక్రమించుకున్న భూమిలో 1.21 ఎకరాలు ప్రభుత్వ భూమి అని, 9 గుంటలు గ్రామ ట్రాక్‌ రోడ్డు అని వివరించారు. పక్కనే ఉన్న 126 సర్వే నంబర్‌లో కోమటికుంట చెరువులోని ఎఫ్‌టీఎల్‌లో 32 గుంటలు, బఫర్‌ జోన్‌లోని 22గుంటల్లో ప్రహరీ నిర్మించారని, అది నీటి వనరుకు ప్రతిబంధకంగా మారిందని నిర్ధారించారు.


ఇది వాల్టా చట్టం అతిక్రమణేనని తేల్చారు. మరోవైపున్న 128 తదితర సర్వే నెంబర్లలో మరో 10 గుంటల భూమిని ముగ్గురు సోదరులు ఆక్రమించారని ఆర్డీవో పేర్కొన్నారు. ప్రహరీ గోడ మీద రేవంత్‌ రెడ్డి, ఆయన ఇద్దరు సోదరుల పేర్లు ఉన్నాయని, ప్రభుత్వ భూముల ఆక్రమణ తొలగించడానికి భూ ఆక్రమణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని, వాల్టా కింద చర్యలు తీసుకుని చెరువును పరిరక్షించాలని కోరారు. కాగా ఎంపీ రేవంత్‌రెడ్డి, ఆయన ఇద్దరు సోదరులు తమ భూముల్లోకి అక్రమంగా చొరబడ్డారని గతంలోనే చందానగర్‌, గచ్చిబౌలి పోలీ్‌సస్టేషన్లలో కేసులు నమోదయ్యాయని ఆర్డీవో తెలిపారు. గచ్చిబౌలి స్టేషన్‌లో 2016లో రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డి తదితరులపై కేసులను బుట్టదాఖలు చేశారని పేర్కొన్నారు. ఆ కేసును తిరగదోడి.. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆర్డీవో తన విచారణ నివేదికలో పోలీసులకు సూచించారు. 

Updated Date - 2020-03-04T08:42:05+05:30 IST