మంత్రి జగదీశ్ రెడ్డిపై రేవంత్ ఫైర్
ABN , First Publish Date - 2020-06-01T22:47:29+05:30 IST
తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
హైదరాబాద్: తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో మంత్రి వ్యవహరించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. మంత్రి తన స్థాయిని మరిచి బజారు రౌడీలా వ్యవహరించారన్నారు. ప్రశ్నించితే సమాధానం చెప్పలేక, చేసిందేమి లేక, ప్రజలకు వివరించలేక ఉత్తమ్‌పై ఎగబడి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారశైలి మంచిదికాదని హితవుపలికారు.
కుస్తీ పోటీలు కావాలంటే ఎక్కడైనా మైదానం చూపిస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మైదనంలోకి వస్తారని.. అప్పుడు మీరేందో.. కాంగ్రెస్ పార్టీ శ్రేణులేందో.. బలాబలాలు తేల్చుకుందామని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. అధికారుల సమావేశంలో రైతుల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అడిగినందుకు ఉత్తమ్‌పై ఆ విధంగా మాట్లాడడాన్ని తెలంగాణ కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుందని రేవంత్ అన్నారు.