కార్మికుల బాధ్యత నిర్మాణదారులదే: కేటీఆర్‌

ABN , First Publish Date - 2020-04-12T09:22:54+05:30 IST

భవన నిర్మాణ కార్మికుల బాగోగులు చూడాల్సిన కనీస బాధ్యత భవన నిర్మాణ యజమానులపైనే ఉన్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది నిర్మాణ కార్మికులు

కార్మికుల బాధ్యత నిర్మాణదారులదే: కేటీఆర్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణ కార్మికుల బాగోగులు చూడాల్సిన కనీస బాధ్యత భవన నిర్మాణ యజమానులపైనే ఉన్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది నిర్మాణ కార్మికులు హైదరాబాద్‌లో పని చేస్తున్నారని తెలిపారు. కార్మికుల్లో ఆత్మవిశ్వాసం నెలకొల్పాలని, వారి సమస్యలను మానవీయ కోణంలో చూడాలని, ఆపత్కాలంలో వారికి అండగా నిలవాలని యజమానులను కోరారు. శనివారం ప్రగతి భవన్‌లో భవన నిర్మాణదారుల సంఘంతో మంత్రి భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రియల్‌ ఎస్టేట్‌ రంగం గణనీయంగా అభివృద్ధి చెందిందని, భవన నిర్మాణదారులకు కూడా ఆ ఫలాలు అందాయన్నారు. కార్మికుల సంక్షేమంపై అశ్రద్ధ చేసినా, నిబంధనలను అతిక్రమించినా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. భవన నిర్మాణ కార్మికుల బాగోగులు, వారి అవసరాలు, సమస్యలపై క్షేత్ర స్థాయిలో బృందాలను నియమించి వాస్తవ పరిస్థితులను అంచనా వేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను మంత్రి ఆదేశించారు.


పారిశ్రామికవేత్తలు అండగా ఉండాలి

కలసికట్టుగా కరోనా మహమ్మారిని ఎదుర్కొని విజయం సాధిద్దామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. శనివారం ఆయన ఆంత్రప్రెన్యూర్స్‌ ఆర్గనైజేషన్‌కు చెందిన సుమారు 90 మంది పారిశ్రామికవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ సంక్షోభ కాలంలో పరిశ్రమలు సురక్షితంగా ఉంటేనే ఉద్యోగుల భవిష్యత్తుకు ఢోకా ఉండదన్నారు. పారిశ్రామిక రంగాలను ఆదుకునేందుకు కేంద్రంతో చర్చిస్తున్నామని తెలిపారు.


కొవిడ్‌-19 యాప్‌ విడుదల 

కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కొవిడ్‌-19 మొబైల్‌ యాప్‌ను కేటీఆర్‌ విడుదల చేశారు. దీనిని వైద్య ఆరోగ్య శాఖ, ఐటీ శాఖ, సిస్కో, క్వాంటెలా సంస్థలు సంయుక్తంగా అభివృద్థి చేశాయి. 

Updated Date - 2020-04-12T09:22:54+05:30 IST