రిపోర్టులు తారుమారు..
ABN , First Publish Date - 2020-06-23T09:17:04+05:30 IST
ఖ్యాతిగడించిన ఉస్మానియా ధర్మాస్పత్రిలో వైద్యులు రోగి బతికుండగానే చనిపోయిందంటూ గందరగోళం సృష్టించారు. తలాబ్‌కట్టకు చెందిన ఓ మహిళ (55) తీవ్ర జ్వరం, శ్వాస ఇబ్బందులతో శుక్రవారం అర్ధరాత్రి ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లింది

- రోగి బతికుండగానే చంపేశారు
- ఉస్మానియా ఆస్పత్రి వైద్యుల నిర్వాకం
- కొవిడ్-19 ఉందని ఒకసారి.. లేదని మరోసారి
- పదేపదే గందరగోళం సృష్టించిన సిబ్బంది
మంగళ్‌హాట్, హైదరాబాద్ సిటీ, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): ఖ్యాతిగడించిన ఉస్మానియా ధర్మాస్పత్రిలో వైద్యులు రోగి బతికుండగానే చనిపోయిందంటూ గందరగోళం సృష్టించారు. తలాబ్‌కట్టకు చెందిన ఓ మహిళ (55) తీవ్ర జ్వరం, శ్వాస ఇబ్బందులతో శుక్రవారం అర్ధరాత్రి ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లింది. గంటల తరబడి ఆమెను నిరీక్షింపజేయడంతో.. బంధువులు ట్విటర్ ద్వారా మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వైద్యులు ఆమెకు చికిత్స ప్రారంభించారు. కాగా.. ఆమె పేరుతోనే ఆస్పత్రిలో అప్పటికే చేరిన మరో రోగి (52)కు కొవిడ్-19 నిర్ధారణ అయ్యింది. ఈమెది కూడా తలాబ్‌కట్ట ప్రాంతమే. అయితే.. తొలుత మొదటి రోగికి కరోనా వచ్చిందంటూ వైద్యులు ఆమె బంధువులకు ఫోన్ చేశారు. ఆ తర్వాత.. కరోనా వచ్చింది రెండో రోగికి అని గుర్తించి, నాలుక కరుచుకున్నారు.
కాగా.. పరిస్థితి విషమించడంతో శనివారం అర్ధరాత్రి రెండో రోగి (52) చనిపోయింది. ఇద్దరి పేర్లు, ప్రాంతాలు ఒకటే కావడంతో రికార్డులు తారుమారయ్యాయి. వెంటనే ఆస్పత్రి వర్గాలు మొదటి రోగి బంధువులకు ఫోన్.. ఆమె చనిపోయినట్లు చెప్పారు. పోలీసు శాఖ నుంచి కూడా వారికి ఫోన్ వెళ్లింది. దీంతో.. ఆ కుటుంబం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. నిజానికి చనిపోయిన రోగి వయసు 52 ఏళ్లు కాగా.. మార్చురీ రికార్డుల్లో 55గా మార్చారు. అనుమానంతో ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఉన్న తమవారికి ఫోన్ చేయగా.. ఆ రోగి నిక్షేపంగా ఉందని, కొవిడ్ ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని చెప్పారు. దీంతో కోపోద్రిక్తులైన రోగి బంధువుల.. తమకు ఫోన్ చేసిన ఆస్పత్రి సిబ్బంది, పోలీసులను నిలదీశారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు రికార్డులు పరిశీలించి, నాలుక కరుచుకున్నారు. చనిపోయింది 52 ఏళ్ల రోగి అని.. ఇద్దరి పేర్లు, ప్రాంతాలు ఒకటే కావడంతో రికార్డులు తారుమారై ఉంటాయని పేర్కొన్నారు. దీనిపై విచారణకు ఆదేశించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపారు.
పోలీస్ కమిషనర్ సమీక్ష
ఉస్మానియాలో రోగి రిపోర్టులు తారుమారై.. బతికున్న రోగిని చనిపోయినట్లు ప్రకటించిన ఉదంతంతోపాటు.. ఇలాంటి సంఘటనలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ స్పెషల్ బ్రాంచ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
గాంధీ ఆస్పత్రిలో మాయమవడం లేదా తారుమారు అవుతున్న మృతదేహాల గురించి కూడా చర్చించారు. ఇలాంటి అంశాలతో రోగి బంధువుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని, వీటికి కారణాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. రెండు రోజుల క్రితం పంజాగుట్ట పీఎస్ పరిధిలోని ఓ కార్పొరేటట్ ఆస్పత్రి వద్ద గొడవ... తాజాగా ఉస్మానియా ఆస్పత్రిలో మృతి చెందిన పేషెంట్ వివరాలు వెల్లడించడంలో జరిగిన నిర్లక్ష్యంపై ఆరా తీశారు.