మతం రంగు రుద్దొద్దు

ABN , First Publish Date - 2020-04-07T09:36:17+05:30 IST

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందని, దీనికి కొందరు మతం రంగు రుద్దే ప్రయత్నం చేయడం సరికాదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో సోమవారం కాంగ్రెస్‌ నేత అనిరుధ్‌

మతం రంగు రుద్దొద్దు

  • ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సహకరిస్తాం: ఉత్తమ్‌
  • సీఎం నిర్ణయం సరైనదే!: విజయశాంతి
  • ప్రైవేట్‌ ల్యాబ్‌ల్లో అనుమతివ్వరేం?: గూడూరు


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందని, దీనికి కొందరు మతం రంగు రుద్దే ప్రయత్నం చేయడం సరికాదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో సోమవారం కాంగ్రెస్‌ నేత అనిరుధ్‌ ఆధ్వర్యంలో శానిటైజర్లను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ విపత్కర సమయంలో ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వానికి తమ వంతు సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో పేదలకు వెంటనే బియ్యం అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 87 లక్షల పేద కుటుంబాలు ఉంటే కేవలం 22 లక్షల మందికే బియ్యం అందాయని తెలిపారు. పేదలకు ఇస్తామన్న రూ.1500 అందలేదని, వలస కార్మికులకు ఇస్తానన్న బియ్యం, రూ.500 సాయం కూడా అందలేదని పేర్కొన్నారు. ప్రజలతో ఉంటూ వారి ఇబ్బందుల్లో పాలు పంచుకోవాలని కాంగ్రెస్‌ నేతలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తాన్న బియ్యం ఇంకా తెలంగాణకు రాలేదని, ఉజ్వలతోపాటు దీపం పథకం కింద ఉన్న లబ్ధిదారులకూ ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు ఇవ్వాలని కోరారు. కాగా.. కరోనా బాధితుల సహాయార్థం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్‌ను ఉత్తమ్‌ పరిశీలించారు. 


కరోనా వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేయాలని, జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్‌లో ఏర్పాటు చేయాలని డీసీసీ అధ్యక్షులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, లాక్‌డౌన్‌ను బ్రేక్‌ చేయకుండా పొడిగించాలని సీఎం తీసుకున్న నిర్ణయం సరైనదేనని తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్‌ విజయశాంతి పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని సంపూర్ణంగా సమర్థిస్తున్నట్లు తెలిపారు. కాగా, హైదరాబాద్‌లోని 9 ప్రైవేట్‌ ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షల నిర్వహణకు ఐసీఎంఆర్‌ ఆమోదించినా, తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ప్రశ్నించారు. ఈ కేంద్రాలు ఒక్కోటి రోజుకు 50 నుంచి వంద వరకు పరీక్షలు నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని తెలిపారు. కరోనా వైరస్‌ పరీక్షల నిర్వహణ రాష్ట్రంలో చాలా నెమ్మదిగా సాగుతోందని, పది శాతం మంది అనుమానితులను కూడా పరీక్షించలేదని ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు పండించిన మక్కలను ఆంక్షలు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వే్‌షరెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ విజ్ఞప్తి చేసింది. గుడ్‌ఫ్రైడే, ఈస్టర్‌, రంజాన్‌ మాసం ప్రారంభం, గురు పౌర్ణిమ, బోనాలు తదితర పండుగల నేపథ్యంలో అన్ని మతాల పెద్దలతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరింది. టీపీసీసీ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి సోమవారం వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఓ ప్రకటనలో ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం హెల్త్‌ బులిటెన్లను సక్రమంగా విడుదల చేయట్లేదని, కేంద్రం విడుదల చేసిన గణాంకాలతో పోలిస్తే వ్యత్యాసాలు ఉంటున్నాయని ఆరోపించారు.

Updated Date - 2020-04-07T09:36:17+05:30 IST