రిజిస్ర్టేషన్.. అదే పరేషాన్...
ABN , First Publish Date - 2020-12-12T05:08:50+05:30 IST
రిజిస్ర్టేషన్.. అదే పరేషాన్...
తెరుచుకోని వెబ్‌సైట్... ప్రారంభం కాని స్లాట్ బుకింగ్స్
హన్మకొండ టౌన్, డిసెంబర్ 11: రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్ ఓపెన్ కాకపోవడంతో శుక్రవారం స్లాటు బుకింగ్స్ నమోదు కాలేదు. కోర్టు ఆదేశాల మేరకు పాత పద్దతిన వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ స్లాటు బుకింగ్స్ నమోదు కాకపోవడం గమనార్హం. భూ వివాదాలకు చెక్ పెట్టేందుకు నూతన నిర్ణయాలు తీసుకుంటున్నామనే కారణం చూపుతూ గత సెప్టెంబర్ 8న ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌లు నిలిపివేసిన విషయం విదితమే. ఎల్‌ఆర్‌ఎస్ ఉన్న స్థలాలకు, అనుమతులు కలిగిన ఇళ్లకే రిజిస్ట్రేషన్‌లు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు కోర్టును ఆశ్రయించారు. ఈ విషయాలను పరిశీలించిన కోర్టు... ప్రభుత్వ నిర్ణయాలను కొన్నింటిని ఒప్పుకుంటూనే ఎల్‌ఆర్‌ఎస్ లాంటి విషయాలపై సూచనలు చేసింది. కోర్టు సూచన మేరకు ప్రభుత్వం పాతపద్దతిన శుక్రవారం నుంచి రిజిస్ట్రేషన్‌లు పునఃప్రారంభించేందుకు నిర్ణయించింది. ఈ క్రమంలో క్రయ విక్రయదారులు ఆన్‌లైన్‌లో స్లాటు బుకింగ్స్ కోసం ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఎల్‌ఆర్‌ఎస్ విషయం, పాత గృహాల రిజిస్ట్రేషన్‌ల లాంటి పలు విషయాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లనే సైట్ ఓపెన్ అయివుండకపోవచ్చని ఆ శాఖ అధికారులు అంటున్నారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నెట్ సెంటర్‌ల వద్ద క్యూ కట్టిన క్రయ విక్రయదారులు సైట్ ఓపెన్ కాకపోవడంతో నిరాశకు గురయ్యారు.