వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు 18 నుంచి మొదలు?
ABN , First Publish Date - 2020-11-13T08:31:54+05:30 IST
వారంలోగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సర్వర్,
‘ధరణి’ ద్వారా అమలు.. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
ఆస్తుల రిజిస్ట్రేషన్లు 18 నుంచి?
‘ధరణి’ ద్వారా అమలు చేసే యోచన.. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
పంట నష్టం, ధాన్యానికి బోన్‌సపై చర్చ
చర్చకు రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలు
హైదరాబాద్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): వారంలోగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సర్వర్, ఇతర సాంకేతిక సమస్యలన్నీ పరిష్కారమైతే ఈ నెల 18న రిజిస్ట్రేషన్లను ప్రారంభిస్తారన్న చర్చ జరుగుతోంది. దీనిపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈమేరకు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుం ది. సమావేశంలో రిజిస్ట్రేషన్లతో పాటు పలు అంశా లు చర్చకు రానున్నాయి. సెప్టెంబరు 8 నుంచి ఆస్తుల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం నిలిపివేసింది. లే-అవుట్ అప్రూవల్స్, భవన నిర్మాణ అనుమతులు లేని ఆస్తులను రిజిస్టర్ చేయొద్దంటూ రిజిస్ట్రేషన్ల శాఖను సర్కారు ఆదేశించింది. అందుకు అనుగుణంగా అక్రమ లే-అవుట్లను క్రమబద్ధీకరించుకోవడానికి లే-అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్‌ఆర్‌ఎ్‌స)ను అమల్లోకి తెచ్చింది.
‘ధరణి’ పోర్టల్ అందుబాటులోకి రావడంతో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను ఈ నెల 2న ప్రారంభించారు. అయితే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు మాత్రం 65 రోజులుగా నిలిచిపోయాయి. ఇప్పటివరకు దాదాపు 6 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయినట్లు, ప్రభుత్వానికి రూ.1600 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా. పైగా పెళ్లిళ్ల సీజన్‌లో ఆస్తుల రిజిస్ట్రేషన్లను నిలిపివేయడంతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, డెవలపర్లు కూడా పెద్ద సంక్షోభంలో ఇరుక్కుపోయారు. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆస్తుల తనఖా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో బ్యాంకుల నుంచి అప్పులు పుట్టడం లేదు. బ్యాంకుల్లో లావాదేవాలు కూడా పెద్దగా సాగడం లేదన్న అభిప్రాయాలున్నాయి. రిజిస్ట్రేషన్లను ప్రారంభించాలంటూ ప్రభుత్వానికి ఇప్పటికే పారిశ్రామిక, భవన నిర్మాణ రంగ సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తులు చేశారు.
ఈ నేపథ్యంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను ప్రారంభించాలని సర్కారు యోచిస్తోంది. వ్యవసాయ భూము ల రిజిస్ట్రేషన్లను ప్రారంభించిన ‘ధరణి’ పోర్టల్ ద్వారానే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను కూడా ప్రారంభించాలని యోచిస్తోంది. ఆస్తుల డేటానంతా అధికారులు ధరణి పోర్టల్‌లోకి బదిలీ చేస్తున్నారు. ఈ కసరత్తు వేగంగా సాగుతోంది. ఒకటి రెండు రోజుల్లో ఇది పూర్తి కావొచ్చని సమాచారం. డేటా బదిలీ కాగానే రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని తెలిసింది.
కేబినెట్‌లో చర్చకొచ్చే అంశాలు
ఫ అక్టోబరులో కురిసిన భారీ వర్షాలతో జరిగిన పంట నష్టంపై కేబినెట్ చర్చించనుంది. హైదరాబాద్‌లో ఆస్తులు కొట్టుకుపోయాయి. ఇలా అన్ని రకాలుగా రూ.8,633 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్ర బృందం పర్యటించి పోయినా ఇప్పటివరకు పరిహారం మాటెత్తడం లేదని రాష్ట్ర సర్కారు గుర్రుగా ఉంది. దీనిపై కేబినేట్‌లో సుదీర్ఘంగా చర్చించనున్నారు. కాగా హైదరాబాద్‌లో వరద బాధితుల్లో పరిహారం ఎంత మందికి అందింది, ఇంకా ఎంతమందికి అందించాలన్న వివరాలపై చర్చించనున్నారు.
సాదాబైనామాలపై హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపైనా చర్చించనున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై కేబినెట్ చర్చించే అవకాశాలు ఉన్నాయి. డిసెంబరు మొదటివారంలో ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు.
ధాన్యం మద్దతు ధరపై రూ.100-150 వరకు బోనస్ ఇస్తామంటూ కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
రైతుబంధు పథకం కూడా చర్చకు రానుంది. రబీ సీజన్‌కు చెల్లించేసొమ్ముపై చర్చ జరగనుంది.
ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్నవారికి ఆయా భూములను క్రమబద్ధీకరించి, వారికి హక్కు కల్పించే అంశం చర్చకు రానుంది.