వ్యవసాయేతర ఆస్తులు..పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు?

ABN , First Publish Date - 2020-12-01T08:04:51+05:30 IST

రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు మళ్లీ పాత పద్ధతిలోనే కొనసాగుతాయా? రిజిస్ట్రేషన్ల శాఖ రూపొందించుకున్న ‘కార్డు’ సాఫ్ట్‌వేర్‌నే పునరుద్ధరించనున్నారా? రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, బిల్డర్లు, డెవలపర్లు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా కొంత కాలం పాటు పాత పద్ధతికి ప్రభుత్వం అనుమతించనుందా?... అంటే అవుననే సమాధానమే వస్తోంది

వ్యవసాయేతర ఆస్తులు..పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు?

ఒకటి, రెండు రోజుల్లోనే స్పష్టత

కేటీఆర్‌ ప్రకటనతో ఊహాగానాలు

3న కోర్టులో స్పష్టత వస్తేనే ‘ధరణి’

ద్వారా రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం

మళ్లీ ‘కార్డు’ సాఫ్ట్‌వేర్‌ ద్వారానే.. ఒకటి, రెండు రోజుల్లోనే స్పష్టత

కేటీఆర్‌ ప్రకటనతో ఊహాగానాలు


హైదరాబాద్‌, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు మళ్లీ పాత పద్ధతిలోనే కొనసాగుతాయా? రిజిస్ట్రేషన్ల శాఖ రూపొందించుకున్న ‘కార్డు’ సాఫ్ట్‌వేర్‌నే పునరుద్ధరించనున్నారా? రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, బిల్డర్లు, డెవలపర్లు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా కొంత కాలం పాటు పాత పద్ధతికి ప్రభుత్వం అనుమతించనుందా?... అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇటీవల మంత్రి కేటీఆర్‌ ప్రకటించిన మేరకు మళ్లీ పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించనున్నట్లు తెలిసింది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి స్పష్టత రానుంది. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను ధరణి పోర్టల్‌ ద్వారా చేపట్టాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది.


అందులో భాగంగానే సెప్టెంబరు 8వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. ఆ తర్వాత నవంబరు 2 నుంచి ధరణి ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. కానీ... వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ధరణిలోకి ఎంట్రీ చేయడంలో సాంకేతిక సమస్యలు ఎదురుకావడం, ఇదే అంశంపై కొంత మంది కోర్టుకెళ్లడంతో రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాలేదు. కోర్టులో కేసు తేలనుందని, నవంబరు 25నుంచి వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించినా.. కార్యరూపం దాల్చలేదు. ఆ పిటిషన్ల విచారణను డిసెంబరు 3వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఆ రోజున స్పష్టత వస్తే... ధరణి ద్వారా రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. కానీ... ఆ రోజున కూడా కోర్టులో స్పష్టత రాకపోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లను ప్రారంభించాలని యోచిస్తోంది. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ల అంశాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లామని, ఒకటి-రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఇటీవల మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.


‘కార్డు’తో ఇబ్బందుల్లేకుండా.. 

స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ సొంతంగా అభివృద్ధి చేసుకున్న కార్డు(కంప్యూటర్‌ ఎయిడెడ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌) సాఫ్ట్‌వేర్‌ ద్వారా రిజిస్ట్రేషన్లను ప్రారంభించినా వచ్చే ఇబ్బందేమీ లేదు. పైగా సాంకేతిక సమస్యలు కూడా ఉండవు. అమల్లో ఉన్న పద్ధతి కావడంతో సబ్‌-రిజిస్ట్రార్లు కూడా వెంటవెంటనే రిజిస్ట్రేషన్లు చేసేస్తారు. ఇప్పటికే రియల్టర్లు, డెవలపర్లు, బిల్డర్లు.. మార్టిగేజ్‌, డెవల్‌పమెంట్‌, మెమోరాండం ఫర్‌ డిపాజిట్‌ ఆఫ్‌ టైటిల్‌ డీడ్‌(ఎంఓడీటీ)ల కోసం 83 రోజులుగా ఎదురు చూస్తున్నారు.


ప్రజలు కూడా తమ ఓపెన్‌ ప్లాట్లు, ఇతర ఆస్తులను అమ్ముకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం కూడా రూ.1800కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. వీటిని దృష్టిలో పెట్టుకుని పాత పద్ధతిలోనే ఆస్తుల రిజిస్ట్రేషన్లను ప్రారంభించాలని సర్కారు యోచిస్తోంది. ఇదిలా ఉండగా.. ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ట్రయల్‌ రన్‌ కొనసాగుతూనే ఉంది. సోమవారం కూడా ఒక్కో సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఐదేసి డమ్మీ రిజిస్ట్రేషన్లు చేశారు. ఈ సందర్భంగా కొన్ని సమస్యలు తలెత్తినా, అవి చాలా చిన్నవని సులభంగా అధిగమించే అవకాశం ఉందని సబ్‌-రిజిస్ట్రార్లు చెప్పారు.

Updated Date - 2020-12-01T08:04:51+05:30 IST