రిజిస్ట్రేషన్లు ఎప్పట్లాగే
ABN , First Publish Date - 2020-12-30T06:29:08+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమమైంది. దాదాపు నాలుగు నెలలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఊరట లభించనుంది. ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు అడ్డంకిగా మారిన ఎల్‌ఆర్‌ఎస్

ఓపెన్ ప్లాట్లకు తొలగిన అడ్డంకి
ఒకసారి రిజిస్టరై, డాక్యుమెంటు ఉన్న వాటికే
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల్లో 90ు ఇలాంటి ప్లాట్లే
కొత్త వెంచర్లలోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయరు
వాటికి లేఅవుట్ అనుమతులు ఉండాల్సిందే
ఉత్తర్వులు జారీ చేసిన రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ
నేటి నుంచి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు తాకిడి
హైదరాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమమైంది. దాదాపు నాలుగు నెలలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఊరట లభించనుంది. ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు అడ్డంకిగా మారిన ఎల్‌ఆర్‌ఎస్ నిబంధనను సర్కారు తొలగించింది. ఇకపై ప్రజలు తమ ఆస్తులను నిరాటంకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇదివరకే ఆస్తులు రిజిస్టర్ అయి ఉండి, డాక్యుమెంట్లు ఉన్న ప్లాట్లనే రిజిస్ట్రేషన్ చేస్తారు. లేఅవుట్ అనుమతులు లేని వెంచర్లలో కొనుగోలు చేసిన కొత్త ప్లాట్లకు మాత్రం రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు. వీటికి లేఅవుట్ అనుమతులు ఉండాల్సిందే. ఈ మేరకు స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఎల్‌ఆర్‌ఎస్ నిబంధనను తొలగిస్తూ ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతించారు.
రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి కార్డ్ సాఫ్ట్‌వేర్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు మళ్లీ ప్రారంభమయ్యాయి. అయితే లేఅవుట్ అనుమతుల్లేని వెంచర్లలో ఉన్న ఓపెన్ ప్లాట్లు, బిల్డింగ్ నిర్మాణ అనుమతులు లేని భవనాలు, అపార్ట్‌మెంట్లలోని భాగాలు, ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. ఇలాంటి ఆస్తులకు రిజిస్ట్రేషన్లు చేయొద్దంటూ స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ఐజీ చిరంజీవులు ఆగస్టు 26న అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 31న ప్రభుత్వం ‘లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్)’ ఉత్తర్వులను జారీ చేసింది. సెప్టెంబరు 1 నుంచి అక్టోబరు నెలాఖరు వరకు మొత్తం 25,59,562 దరఖాస్తులు వచ్చాయి. క్రమబద్ధీకరణ రుసుములపై కొందరు కోర్టుకు వెళ్లడంతో ఈ దరఖాస్తులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. దీంతో ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. వాస్తవానికి ఎల్‌ఆర్‌ఎస్ కోసం వచ్చిన 25.59 లక్షల దరఖాస్తుల్లో 90 శాతం వరకు ఒకసారి రిజిస్టరైన ఆస్తులే. ఇలాంటి ప్లాట్లకు డాక్యుమెంట్లు, డాక్యుమెంట్ నంబర్లు కూడా ఉన్నాయి.
అయినా ఇవి రిజిస్ట్రేషన్లకు నోచుకోకుండా పడి ఉన్నాయి. లేఅవుట్ అనుమతుల నిబంధనను మొదటి నుంచి అమలు చేయకపోవడంతో ప్రజల్లో దీని గురించి అవగాహన లేకుండా పోయింది. అందుకే అనుమతుల్లేని వెంచర్లలో సైతం ప్లాట్లను కొనుగోలు చేసి పెట్టుకున్నారు. వీటికి రిజిస్ట్రేషన్లు చేయబోమని ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజలు ఆందోళన చెందారు. తాజాగా ప్రభుత్వం అనుమతివ్వడంతో వీటికి ఆటంకం తొలగిపోయింది. బుధవారం నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు తాకిడి పెరగనుంది.
4 నెలలుగా ఇక్కట్లు..
ఈ ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్లు అనేక ఇబ్బందులకు గురయ్యాయి. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే కరోనా లాక్‌డౌన్ గుదిబండగా మారింది. దాన్నుంచి బయటపడి, వ్యవస్థ గాడిన పడుతున్న సమయంలో ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరం మార్చి 20 వరకు రిజిస్ట్రేషన్లు సాఫీగా సాగాయి. కానీ, మార్చి 22 నుంచి లాక్‌డౌన్ ప్రారంభమవడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఏప్రిల్‌లో కూడా ప్రారంభం కాలేదు. 2021 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.10 వేల కోట్ల రాబడిని అంచనా వేశారు. మే 5 వరకు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో దాదాపు రూ.1000 కోట్ల ఆదాయం పోయింది. అన్‌లాక్‌లో భాగంగా ప్రభుత్వం మే 6 నుంచి మళ్లీ రిజిస్టే్ట్రషన్లకు అనుమతించింది. సెప్టెంబరు 7 వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగాయి. సెప్టెంబరు 8 నుంచి ప్రభుత్వం మళ్లీ రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది.
ధరణి ద్వారా రిజిస్ట్రేషన్లు చేపడతామంటూ ఈ ప్రక్రియను ఆపేసింది. అక్టోబరు 29న ధరణి పోర్టల్ ప్రారంభమవడంతో నవంబరు 2 నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. 4 నెలలుగా రిజిస్ట్రేషన్లు ఆటుపోట్లకు గురయ్యాయి. ఎట్టకేలకు ఈ నెల 21న ‘కార్డ్’ సాఫ్ట్‌వేర్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అయినా ఓపెన్ ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్ నిబంధన అడ్డంకిగా మారింది. తాజా ఉత్తర్వులతో రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమమైంది.