జనగామ జిల్లాలో 44 రిజిస్ట్రేషన్లు

ABN , First Publish Date - 2020-12-31T04:08:03+05:30 IST

జనగామ జిల్లాలో 44 రిజిస్ట్రేషన్లు

జనగామ జిల్లాలో 44 రిజిస్ట్రేషన్లు

ఎల్‌ఆర్‌ఎస్‌ ఎత్తివేసినా క్రయ విక్రయాలు అంతంత మాత్రమే

జనగామ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ బుధవారం జిల్లాలో రిజిస్ట్రేషన్లు అంతంత మాత్రంగానే జరిగాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు బుధవారం పెద్దఎత్తున తాకిడి ఉంటుందని భావించిన అధికారుల అంచనాలు తారుమారయ్యాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కొన్ని రోజులు రిజిస్ట్రేషన్లు నిలిచిపోగా.. ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌, ధరణి పోర్టల్‌ కారణంగా నాలుగు నెలలుగా రిజిస్ట్రేషన్లు జరగలేదు. నిబంధనలను సవరించి ‘కార్డ్‌’ ద్వారా రిజిస్ట్రేషన్లు జరిగేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా ఈ నెల 21 నుంచి రిజిస్ట్రేషన్లు పునఃప్రారంభమయ్యాయి. కానీ ఎల్‌ఆర్‌ఎస్‌ లేని ప్లాట్లు, నిర్మాణాల రిజిస్ట్రేషన్లు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం మంగళవారం తీసుకున్న నిర్ణయంతో జిల్లావ్యాప్తంగా చాలా మందికి ఊరట లభించింది. కానీ ఎందుకో బుధవారం జిల్లాలో పెద్దగా రిజిస్ట్రేషన్లు కాలేదు. మంగళవారంతో పోలిస్తే చాలా తక్కువగా జరిగాయి. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, కొడకండ్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో మంగళవారం నాడు 80 రిజిస్ట్రేషన్లు జరగగా.. బుధవారం కేవలం 44 రిజిస్ట్రేషన్లు మాత్రమే అయ్యాయి. ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనను ఎత్తివేస్తూ ప్రభుత్వం ఎలాగూ నిర్ణయం తీసుకున్నందున నెమ్మదిగా క్రయ విక్రయాలు చేసుకోవచ్చనే ధోరణిలో ప్రజలు ఉండొచ్చని, అందువల్లే రిజిస్ట్రేషన్లు పెద్దగా జరగలేదని అధికారులు భావిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల తర్వాత రిజిస్ట్రేషన్లలో వేగం పెరగొచ్చని చెబుతున్నారు. 


Updated Date - 2020-12-31T04:08:03+05:30 IST