289 మంది జీఎన్ఏంలకు నియామక పత్రాలిచ్చిన మంత్రి హరీష్

ABN , First Publish Date - 2020-06-18T21:01:37+05:30 IST

289 మంది జీఎన్ఏంలకు హరీష్ రావు నియామక పత్రాలను అందజేశారు.

289 మంది జీఎన్ఏంలకు నియామక పత్రాలిచ్చిన మంత్రి హరీష్

సిద్ధిపేట: ఏన్సాన్ పల్లి శివారులోని మెడికల్ కళాశాలలో వీర జవాన్ కల్నల్ సంతోష్ బాబు చిత్ర పటానికి గురువారం ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పూలమాలతో నివాళులు అర్పించారు. అనంతరం నూతనంగా నియామకమైన స్టాఫ్ నర్సులు 289 మంది జీఎన్ఏంలకు హరీష్ రావు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి స్టాప్ నర్సులను ఉద్దేశించి మాట్లాడుతూ డాక్టరుకు రోగికి మధ్య సంధాన కర్తగా స్టాఫ్ నర్సులు వ్యవహరించాలన్నారు. డాక్టరులోని ఒత్తిడిని తగ్గించేలా.. రోగిలోని మానసిక ధైర్యాన్ని పెంచేలా నర్సులు విధులు నిర్వర్తించాలని సూచించారు. ఎంత పని ఒత్తిడి ఉన్నా.., నర్సుల పెదాలపై చిరునవ్వు ఉండాలని, ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు విశ్వసాన్ని, నమ్మకాన్ని కలిగించాలన్నారు. 


మానవ సేవయే.. మాధవ సేవగా.. నర్సులు చేసే విధి.. ఒక తల్లిలా.. ఒక చెల్లిలా.. ఒక తండ్రి లాంటిందని మంత్రి హరీష్ అన్నారు. కరోనా అంటే.. భయపడాల్సిన అవసరం లేదని, కోవిడ్-19 కోసం సిద్ధిపేటలో 10 పడకల ఆసుపత్రిని మంజూరు చేసుకున్నామన్నారు. అతి త్వరలోనే డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని సిద్ధిపేటకు అందుబాటులో తేనున్నామన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగి శారీరకంగా, మానసికంగా బలహీనంగా ఉంటారని, అలాంటి రోగితో.. సిబ్బంది ప్రవర్తించే విధానం బాగుండాలన్నారు. డెలివరీ సమయంలో గర్భిణీకి వచ్చే ఇబ్బందులపై ప్రత్యేక దృష్టి సారించాలని, నార్మల్ డెలివరీ చేయాలని ప్రభుత్వం సూచిస్తున్న క్రమంలో.. ప్రసవ వేదనలో ఉండే.. మహిళకు, వారి కుటుంబీకులకు అర్థమయ్యే విధంగా నార్మల్ డెలివరీ ఆవశ్యకతను తెలియజేయాలన్నారు. మాతా, శిశు మరణాలు పూర్తిగా తగ్గించాలని, సిద్ధిపేటలో ఎన్ఐసీయూ, కంగారు పద్ధతిలో వైద్య సౌకర్యాలు ఉన్నాయని, తొందరపడి బయటకు రెఫర్ చేయొద్దని  నర్సులకు హరీష్‌రావు సూచించారు.

Updated Date - 2020-06-18T21:01:37+05:30 IST