కరోనా తర్వాత వేగంగా భారత వృద్ధి
ABN , First Publish Date - 2020-05-17T09:56:12+05:30 IST
భారత్‌లో మౌలిక సౌకర్యాలు, మానవ సంపత్తి పుష్కలంగా ఉన్నందున కరోనా సంక్షోభం ముగిసిన వెంటనే దేశ ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకుంటుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి....

పునరుత్తేజ చర్యలతో గాడిలోకి ఎకానమీ
ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి
హైదరాబాద్, మే 16(ఆంధ్రజ్యోతి): భారత్‌లో మౌలిక సౌకర్యాలు, మానవ సంపత్తి పుష్కలంగా ఉన్నందున కరోనా సంక్షోభం ముగిసిన వెంటనే దేశ ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకుంటుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం ఎంసీఆర్‌హెచ్చార్డీలో జరిగిన 142మంది ట్రైనీ సివిల్ సర్వెంట్ల ప్రత్యేక ఫౌండేషన్ కోర్సు ముగింపు కార్యక్రమంలో ఆయన వర్చువల్ పద్ధతిలో ప్రసంగించారు. కరోనా సంక్షోభం ముగిసేటప్పటికి దేశీయ ఆర్థిక రంగం తీవ్ర ఒత్తిడిలో ఉంటుందని సుబ్బారావు చెప్పారు. అయితే అదే సమయంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరల తగ్గుదల, రూపాయిలో స్థిరత్వం, ఇబ్బడిముబ్బడిగా పంట ఉత్పత్తులు చేతికి వస్తాయని, ఇవన్నీ దేశానికి కలిసివచ్చే అంశాలని ఆయన తెలిపారు. ద్రవ్యలోటుపై అదనపు ఒత్తిడి పడకుండా వృద్ధిరేటును తిరిగి గాడిన పెడుతూ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే లక్ష్యంతో కొవిడ్-19పై పోరాటం చేయాల్సి ఉంటుందని సుబ్బారావు పిలుపునిచ్చారు. మార్కెట్లకు, పెట్టుబడిదారులకు విశ్వాసం కలిగించి ఆర్థిక రంగానికి పునరుత్తేజం కలిగించడానికి వినియోగం, ఉత్పత్తి, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.